విపత్తు పునరుద్ధరణ ప్రాజెక్టు పనులను డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ అధికారులను ఆదేశించారు. విజయవాడలో జరిగిన ఏపీడీఆర్పీ 4వ రాష్ట్రస్థాయి ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీ సమావేశంలో సీఎస్ అధికారులను ఆదేశించారు. ‘ప్రపంచ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో రూ.1,773 కోట్ల అంచనాలతో శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు చేపట్టిన ఏపీడీఆర్పీ పనులను త్వరగా పూర్తిచేయాలని అన్నారు.
కరోనా కారణంగా 2015-20 మధ్య పూర్తి కావలసిన పనులు నిలిచిపోయాయని... పనులు పూర్తి చేసేందుకు ప్రపంచ బ్యాంకు మరో ఏడాది గడువు పెంచింది’ అని తెలిపారు. ఇప్పటి వరకు రూ.1,452 కోట్లు ఖర్చు చేసి 73 శాతం పనులు పూర్తి చేసినట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి సమావేశంలో వివరించారు. ఆర్థిక, రహదారుల శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్‌ఎస్ రావత్, ఎంటీ కృష్ణబాబు, ఏపీడీఆర్పీ ప్రాజెక్టు డైరెక్టర్ కన్నబాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు.