KCR Yadadri Visit : యాదాద్రి దివ్యక్షేత్రం మహాకుంభ సంప్రోక్షణ ఏర్పాట్లపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. మహా సుదర్శన యాగం, మహాకుంభ సంప్రోక్షణ ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఆలయ అభివృద్ధి పనులు, ఇతర నిర్మాణాల పురోగతిపై దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ నుంచి యాదాద్రికి హెలికాప్టర్‌లో చేరుకున్న కేసీఆర్.. ముందుగా విహంగ వీక్షణం చేశారు. హెలికాప్టర్ నుంచి యాదాద్రి పరిసరాలను గమనించారు. అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం కొండపైకి చేరుకున్న ఆయన లక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్నారు. కేసీఆర్‌కు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. బాలాలయంలో లక్ష్మినారసింహుడికి.. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు వేదాశీర్వచనం చేయగా...కార్యనిర్వహణాధికారి ముఖ్యమంత్రికి స్వామివారి ప్రసాదం అందజేశారు.
అధికారులకు సూచనలు
నారసింహుని దర్శనం అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులపై దృష్టిసారించిన కేసీఆర్.. ప్రధానాలయం, గర్భగుడి, కల్యాణకట్ట, పుష్కరిణి నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం వెంట మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శి నర్సింగరావు ,ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
పనుల పురోగతిపై రివ్యూ
కొండ కిందకు చేరుకున్న కేసీఆర్.. కల్యాణకట్ట, గండి చెరువు సమీపంలో లక్ష్మిపుష్కరిణి పనులను పరిశీలించారు. మార్చి 21 నుంచి మహాసుదర్శన యాగం నిర్వహించనుండగా.. 75 ఎకరాల విస్తీర్ణంలో యాగానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మహాసుదర్శన యాగ స్థలాన్ని ఇప్పటికే చదును చేయగా కేసీఆర్ పరిశీలించారు. అన్నదానం కాంప్లెక్స్, సత్యనారాయణ వ్రతాలు, దీక్షాపరుల మండపాలు, బస్టాండ్ పనులు పరిశీలించారు. పుష్కరిణి వద్ద స్నానపుగదుల నిర్మాణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి వలయ రహదారిపై కాన్వాయ్ దూసుకెళ్తుండగా చుట్టూ పచ్చదనాన్ని వీక్షిస్తూ ముఖ్యమంత్రి ముందుకు సాగారు. రాష్ట్రపతి తదితర వీవీఐపీల ప్రెసిడెన్షియల్ కాటేజీకి వెళ్లారు. అనంతరం కొండపైకి చేరుకున్న సీఎం కేసీఆర్.. సుదర్శనయాగం, మహా కుంభ సంప్రోక్షణపై అధికారులతో సమీక్షించారు. సుదర్శన యాగంలో 1108 యజ్ఞ గుండాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో గుండానికి ఆరుగురి చొప్పున దాదాపు 6 వేల పైచిలుకు రుత్విక్కులు పాల్గొననున్నారు. దేశ విదేశాల నుంచి యాదాద్రి పునఃప్రారంభ వేడుకలకు వచ్చే ప్రముఖులు, అతిథులు, మఠాధిపతులు , పీఠాధిపతులు, లక్షలాది మంది భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు.