Polavaram: పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో నిర్దిష్టంగా చెప్పలేని దుస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని పలువురు వక్తలు విమర్శించారు. దీనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడు రావుల వెంకయ్య అధ్యక్షతన విజయవాడ దాసరిభవన్‌లో శనివారం కొల్లి నాగేశ్వరరావు ద్వితీయ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక ఉద్యమకారుడు టి.లక్ష్మీనారాయణ రచించిన ‘పోలవరం ఎన్నటికి సాకారమయ్యేను!’ పుస్తకాన్ని మాజీ మంత్రి, రైతు నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆవిష్కరించారు.
పోలవరం నిధుల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై ఒత్తిడి చేయాలని అన్నారు. శ్రీశైలం డ్యాం ముందు ఏర్పడిన 130 అడుగుల లోతు గుంత పూడ్చడానికి ఎందుకు అలక్ష్యం చేస్తున్నారని ఏమైనా జరిగితే ఊహించని ప్రమాదం చోటుచేసుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మాట్లాడుతూ ‘పోలవరం డయాఫ్రంవాల్ పనులకు కేంద్రం డబ్బులు ఇస్తుందా? రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేయాలా? అనే దానిపై స్పష్టత లేదు...’ అని పేర్కొన్నారు. ప్రాజెక్టుల మరమ్మతులు, నిర్మాణాలకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని.. విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కోరారు.