AP, ODISHA CS's Virtual Meeting:అంతర్రాష్ట్ర అంశాల పరిష్కారం కోసం.. ఏపీ, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వాల చర్యలు ప్రారంభించాయి. ఇరురాష్ట్రాల మధ్యన నెలకొన్న సమస్యలను నిర్ధిష్ట వ్యవధిలోగా పరిష్కరించుకునే విషయమై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, నవీన్ పట్నాయక్ గతంలో భువనేశ్వర్‌లో భేటీ అయ్యారు. సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాల సీఎస్‌ల నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో.. సోమవారం ఏపీ సీఎస్ సమీర్ శర్మ., ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేశ్ చంద్ర, ఇతర ఉన్నతాధికారులు వర్చువల్‌గా భేటీ అయ్యారు. సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశాల మధ్య.. ఎనర్జీ,నీటి వనరులు, ఉన్నత విద్య, పాఠశాల విద్య, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు.
జోలాపుట్ డ్యాం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, లోయర్ మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు.., బలిమెల డ్యాం , చిత్రకొండ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు సంబంధించి పరిష్కరించుకోవాల్సిన అంశాలపై సమాలోచనలు చేశారు. వంశధార నదిపై నేరెడి బ్యారేజి.., ఝంఝావతి రిజర్వాయర్ ప్రాజెక్టు, బహుదా నది నీరు విడుదలకు సంబంధించి.. పంపు స్టోరేజి ప్రాజెక్టులకు ఇరు రాష్ట్రాల తరుపున ఎన్ఒసిలు మంజూరు అంశాలపై సమీక్షించారు.
అంతర్ రాష్ట్ర ఒప్పందానికి అనుగుణంగా బలిమెల పంపు స్టోరేజికి.. బలిమెల హై హెడ్ పవర్ హౌస్ నుంచి నీటిని విడుదల చేయరాదని.. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి పేర్కొన్నారు. నేరడి బ్యారేజి నిర్మాణానికి ఒడిశా ప్రభుత్వం 106 ఎకరాల భూమిని అప్పగించాల్సి ఉందని జాయింట్ సర్వే చేపట్టి త్వరితగతిన భూమిని అప్పగిస్తే.. బ్యారేజీ సకాలంలో పూర్తై ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని సమావేశం దృష్టికి తెచ్చారు.