జాతీయ టాస్కుఫోర్సు కమిటీ సభ్యుడు వెదిరె శ్రీరాం అధ్యక్షతన ఇవాళ దిల్లీలో జరుగుతున్న సమావేశంలో గోదావరి కావేరి అనుసంధాన ప్రతిపాదనపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సమావేశానికి ఎవరూ వెళ్లట్లేదు. జాతీయ జల అభివృద్ధి సంస్థ తెలంగాణ నుంచి గోదావరి నీటిని నాగార్జునసాగర్, సోమశిల మీదుగా గ్రాండ్ ఆనకట్టకు తరలించేలా మూడు ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసి గతంలోనే పంపింది. వాటిపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆ అభ్యంతరాలను జాతీయ జల అభివృద్ధి సంస్థకు తెలియజేశారు. అంతకన్నా పోలవరం నుంచి అనుసంధానం చేపడితే తమకు అభ్యంతరం ఉండబోదని ఏపీ పేర్కొంటోంది.
2 చోట్ల నుంచి 3 ప్రత్యామ్నాయాలు
తెలంగాణలోని రెండు చోట్ల నుంచి గోదావరి జలాలను మళ్లించేలా జల అభివృద్ధి సంస్థ ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసింది.
మొదటి ప్రత్యామ్నాయం: గోదావరిపై జానంపేట నుంచి కృష్ణాలో నాగార్జునసాగర్‌కు, అక్కడి నుంచి పెన్నాలో సోమశిల జలాశయానికి, అక్కడి నుంచి కావేరిపై గ్రాండ్ ఆనకట్టకు జలాల తరలింపు.. కాలువ మార్గంలోనే మళ్లింపు.
రెండో ప్రత్యామ్నాయం: గోదావరిపై ఇచ్చంపల్లి నుంచి కృష్ణాలో నాగార్జునసాగర్‌కు, అక్కడి నుంచి పెన్నాలో సోమశిల జలాశయానికి, అక్కడి నుంచి కావేరిపై గ్రాండ్ ఆనకట్టకు జలాల తరలింపు.. కాలువ మార్గంలో మళ్లింపు.
మూడో ప్రత్యామ్నాయం: రెండో విధానంలో భాగంగా కాలువ కాకుండా పైపులైన్ల ద్వారా నీటిని మళ్లించడం.