Amaravati maha pada yathra: అమరావతి రైతులకు మద్దతుగా..రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ ర్యాలీలు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరంలో.. తాడితోట జంక్షన్ వద్ద రాజకీయ పార్టీలు ప్రదర్శన నిర్వహించాయి. ర్యాలీలో తెదేపా, కాంగ్రెస్, వామపక్ష నాయకులు పాల్గొన్నారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నినాదాలు చేశారు. అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా గుడివాడ, గన్నవరంలో తెదేపా శ్రేణులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా అదోనిలో భారీ ప్రదర్శన చేపట్టారు. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని అంటూ... తెదేపా కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతపురం జిల్లాలో..
Ananthapuram: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డీ హిరేహాల్ మండలం కల్యం గ్రామంలో అమరావతి రైతులకు మద్దతుగా తెదేపా నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెదేపా నాయకులతో కలిసి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. కల్యం గ్రామం నుంచి మురడి వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. మురడి గ్రామంలో జరుగు తెలుగుదేశం పార్టీ గౌరవ సభకు తేదేపా శ్రేణులతో కలిసి కాల్వ హాజరుకానున్నారు. కాల్వ పాదయాత్రలో తెదేపా నేత అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పూల నాగరాజు, తెదేపా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కడపలో..
Kadapa: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కడప తెదేపా బాధ్యులు అమీర్ బాబు డిమాండ్ చేశారు. అమరావతి రైతుల ర్యాలీకి మద్దతుగా కడపలో తేదేపా ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు. ఎక్కడైనా రాష్ట్రానికి ఓకే రాజధానిగా ఉంటుందని ఆ విషయాన్ని ప్రజాప్రతినిధులను గుర్తుంచుకోవాలని కోరారు. కేవలం జగన్ సర్కార్ తన ఆర్థిక లావాదేవీల కోసం రాజధానిని విశాఖపట్టణానికి బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. విశాఖపట్నాన్ని రాజధాని చేయడం వల్ల చాలా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. రాజధాని కోసం రైతులు కొన్ని వేల ఎకరాల భూములు ఇచ్చారని పేర్కొన్నారు. అమరావతి రాజధానిగా ఉంచడం రాష్ట్ర ప్రజలందరికీ సమ్మతం అనే అంశాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని తెలిపారు.