ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ:కష్టాల్లో నేనున్నానంటూ ఓ చిన్న ఓదార్పు.. - SIDDIPET DISTRICT NEWS

మనిషికి మనిషే తోడు. తోటి వారికి సాయం చేయడం కంటే పరమార్థం ఏముంటుంది? ఆ సాయం డబ్బో... మరొకటో మాత్రమే కానవసరం లేదు. ఆర్తుల కష్టాల్లో నేనున్నానంటూ అందించే చిన్న ఓదార్పు... మాట సాయం కూడా విలువైనవే. ఆ ఉపాధ్యాయుడు అనుసరిస్తున్న మార్గమిదే. ఉద్యోగాలు చేసేవారెవరైనా సెలవు రోజుల్లో కుటుంబంతో గడపడానికో... విశ్రాంతి తీసుకోవడానికో ప్రాధాన్యమిస్తారు. కానీ ఈయన మార్గం విభిన్నం. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించడానికి తన సెలవులను వినియోగిస్తారు. అవసరమైతే సెలవు పెట్టి మరీ వెళ్తారు. ఓదార్చడమే కాదు. బాధితుల వివరాలు సేకరించి, తన మిత్రులు, దాతల ద్వారా వారికి సాయం అందేలా కృషి చేస్తుంటారు.

A teacher who stands by the families of a farmer who has committed suicide in siddipet district
తెలంగాణ:కష్టాల్లో నేనున్నానంటూ ఓ చిన్న ఓదార్పు..

By

Published : Jan 10, 2021, 4:33 PM IST

గత 18 ఏళ్లలో సుమారు రెండు వేల కుటుంబాలను స్వయంగా కలిసి అండగా నిలిచిన ఆయన పేరు పులిరాజు. ఊరు సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన పులిరాజు సాగులో కష్టనష్టాలను చూస్తూ పెరిగారు. బాగా చదువుకుని 2002లో ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువు సాధించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ఆయనను కదిలించేవి. తను పాఠాలు చెప్పే బడుల్లోనూ విద్యార్థుల తండ్రులు అప్పుల బాధలతో అకాల మరణం చెందడం చూసి బాధపడేవారు. వారి కుటుంబాలకు ఏదైనా చేయాలని సంకల్పించారు. పత్రికల్లో రైతు ఆత్మహత్యల వార్తలు చదవగానే.. బాధిత కుటుంబ వివరాలు నమోదు చేసుకుంటారు. ఆదివారం లేదా సెలవు పెట్టి ఆ కుటుంబం వద్దకు వెళతారు.

ప్రత్యేకంగా ఓ పుస్తకంలో..

ఆత్మహత్యకు కారణాలేంటి? ఎంత అప్పు చేశారు? సాగులో నష్టాలకు కారణాలేంటి? ఇలా సమగ్ర సమాచారం సేకరిస్తారు. దాన్నంతటినీ ప్రత్యేకంగా ఓ పుస్తకంలో నమోదు చేస్తారు. బాధితుల దయనీయ స్థితిగతులను దాతలకు చేరవేస్తుంటారు. ఆయన ఇచ్చిన సమాచారంతో స్పందించిన పలువురు దాదాపు 30 కుటుంబాల్లోని పిల్లల చదువులు ఆగిపోకుండా కొనసాగేందుకు చేయూత అందిస్తున్నారు. అలా చదువుకున్న వారిలో కొందరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. పిరమిల్‌ సంస్థ 2015లో జగదేవపూర్‌ మండలంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు చెందిన ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని చదివిస్తోంది. కొందరు ప్రవాసులూ పిల్లల చదువులకు సాయం కొనసాగిస్తున్నారు. పులిరాజు 2017లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. 2019లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి రైతునేస్తం అవార్డు స్వీకరించారు. పిల్లలకు పాఠాలు చెబుతూనే.. బాధిత కుటుంబాలకు తోడ్పాటునివ్వడం ఎంతో సంతృప్తినిస్తోందని పులిరాజు చెబుతున్నారు.

చెప్పిన మర్నాడే రూ. 2 లక్షల సాయం

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం రాంపూర్‌కి చెందిన సంతోష భర్త అశోక్‌ వ్యవసాయం చేసి అప్పుల పాలయ్యారు. రుణదాతల ఒత్తిడి తట్టుకోలేక 2017లో ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి మూర్ఛతో బాధపడుతున్న కుమార్తె రిషిక ఉంది. పులిరాజు ఇటీవల ఆ ఇంటికి వెళ్లారు. వారి దుర్భర స్థితిని తెలుసుకుని, చక్రధర్‌గౌడ్‌ అనే వ్యాపారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గౌడ్‌ ఆ మరుసటి రోజే రాంపూర్‌ వచ్చి సంతోషకు రూ.2 లక్షల నగదు అందించారు. రిషిక బాధ్యత తానే తీసుకుంటానని మాట ఇచ్చారు.

ఇవీ చూడండి:రాయదుర్గంలో ముందుకు సాగని రహదారి విస్తరణ

ABOUT THE AUTHOR

...view details