గోవును జాతీయ జంతువుగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ... హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక మండలి తీర్మానం చేసింది. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో సమావేశమైన మండలి... కల్యాణమస్తు సామూహిక వివాహాలకు మరిన్ని ముహూర్తాలు నిర్ణయించాలని పండిత మండలిని కోరింది. 'గుడికో గోమాత' కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మరింత వేగంగా అమలు చేయడానికి మార్గదర్శకాలు రూపొందించాలని తితిదే ఛైర్మన్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ నుంచి 31 ఆలయాలు..గోమాత కోసం దరఖాస్తు చేసుకున్నాయని అధికారులు వివరించారు. ఆలయాల్లో గోవు, దూడకు తగిన వసతి, వాటి పోషణకు అవసరమైన ఏర్పాట్లు పరిశీలించి గోవులను అందించాలని ఛైర్మన్ సూచించారు. పట్టణ వీధుల్లో తిరిగే గోవులను గోశాలలకు తరలించి వాటి పోషణకు నిధులు కేటాయించాలని నిర్ణయించారు. సమావేశంలో తితిదే ఈవో జవహర్ రెడ్డి, పాలకమండలి సభ్యులు జూపల్లి రామేశ్వరరావు తదితరలు పాల్గొన్నారు.