తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వరకు జరగనున్నాయని, మాడవీధుల్లో శ్రీవారి వాహనసేవలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తితిదే ఈవో బ్రహ్మోత్సవాల వివరాలను వెల్లడించారు. సెప్టెంబరు 27న సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరగనుందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. అక్టోబరు 1న గరుడవాహన సేవ, 2న స్వర్ణరథం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం జరుగుతాయన్నారు. కరోనా కారణంగా గతంలో రెండు పర్యాయాలు వాహనసేవలు ఏకాంతంగా నిర్వహించినట్లు తెలిపారు.