ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Diseases Fear: ముంపుమయం.. రోగాల భయం.. లోతట్టు ప్రాంతాలు విలవిల

diseases Fear: తూర్పుగోదావరి జిల్లా ఇంకా ముంపులోనే కొనసాగుతుంది. వరద నీరు తొలగకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. నీళ్లు, పాలు, తిండికి సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగాల భయం చుట్టుముట్టింది. రాజమహేంద్రవరంలోనూ లోతట్టు ప్రాంతాల విలవిల్లాడుతున్నాయి.

flood water
ఇంకా ముంపులోనే

By

Published : Jul 21, 2022, 9:33 AM IST

Diseases Fear: ‘వేదంలా ఘోషించే గోదావరి.. అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి.. శతాబ్దాల చరిత గల సుందర నగరం.. గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం’ రాజమహేంద్రవరం గొప్పతనాన్ని అద్భుతంగా వర్ణించిన గీతమిది. ఇంత సుందర నగరమైనా.. శతాబ్దాల చరిత్ర ఉన్నా డ్రైనేజీ ఔట్‌లెట్‌ లేని దయనీయ పరిస్థితి. మురుగునంతా గోదావరిలోకే నెట్టేసే దౌర్భాగ్యకర దుస్థితి. దశాబ్దాలుగా ఇది ఇలాగే సాగిపోతోంది. నదీమతల్లి ప్రకోపిస్తే.. వరదలతో ఉగ్రరూపం దాల్చితే మాత్రం నగరం తన మురుగులో తానే మునిగిపోతుంది. కొన్ని రోజులు, నెలల పాటు తీవ్ర దుర్గంధం.. దోమలు, రోగాలు వెంటాడుతుంటాయి. తాజాగా మరోసారి అదే దుస్థితి నెలకొంది!

నిత్యావసరాలు కావాలంటే ఇల్లు దాటే పరిస్థితి లేదు.. వెళ్లాలంటే నడుం లోతు నీళ్లు. కనీసం పాలు, నీళ్లూ దొరకని దయనీయ పరిస్థితి. ఇదీ తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం నగరం, అనుబంధ గ్రామీణ ప్రాంతాల్లో ఆరు రోజులుగా నెలకొన్న దైన్యస్థితి. గోదావరి మహోగ్ర రూపం దాల్చడంతో ముంపు సమస్య తీవ్రమైంది. వర్షం నీరు, మురుగు గోదావరిలోకి వెళ్లే మార్గం లేక ఆవాసాల పైకి ఎగదన్నింది. తీవ్రమైన దుర్గంధం మధ్య ప్రజలంతా అష్టకష్టాలు పడుతూ ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికీ చాలా ప్రాంతాలు ముంపులో మగ్గుతున్నాయి. పాములు, రోగాల భయమూ వెంటాడుతున్నా.. కనీస సహాయక చర్యలు కనిపించక ఆవేదన చెందుతున్నారు.

1.40 లక్షల మందికి ఇక్కట్లు:రాజమహేంద్రవరం నగరం, గ్రామీణంలోని 18 లోతట్టు ప్రాంతాల్లో 1.40 లక్షలమంది ముంపు సమస్యతో అల్లాడుతున్నారు. ప్రవాహానికి దిగువన ఆవాసాలు ఉండడం.. నగర పాలికలో డ్రైనేజీ వ్యవస్థ, మురుగు తోడే పంపింగ్‌ వ్యవస్థ సరైనది లేకపోవడం, గ్రామీణంలోని ఆవ ఛానల్‌ ఆక్రమణ తదితర కారణాలతో ముంపు వేధిస్తోంది. నగరంలో ఆర్యాపురం, తుమ్మలావ, కోటిలింగాలపేట, కృష్ణానగర్‌, లలితానగర్‌, గోదావరి ఒడ్డున దిగువ ప్రాంతాలు మునిగాయి. గ్రామీణంలో నేతాజీనగర్‌, రామకృష్ణానగర్‌, సావిత్రినగర్‌, తూర్పు రైల్వేస్టేషన్‌, హుకుంపేట, బాలాజీపేట ప్రాంతాలదీ అదే పరిస్థితి. ఇప్పటికీ కొన్నిచోట్ల బోట్లు, ట్రాక్టర్లపై రాకపోకలు సాగిస్తున్నారు.

మురుగంతా గోదావరిలోకే:నగరంలో రోజుకు 65 మిలియన్‌ లీటర్ల వ్యర్థాలు వస్తున్నాయి. ఎగువ నుంచి వచ్చే మురుగు ఛానల్‌ ద్వారా, దిగువ ప్రాంతాల నీరు ఆవ ఛానల్‌ ద్వారా ధవళేశ్వరం వద్ద గోదారిలోకి వదిలేస్తారు. ఇవి రెండూ నదికి దిగువన ఉన్నాయి. వరదతో నదీ ప్రవాహం పెరిగితే కాలువలు మూసుకుపోయి.. నీరు వెనక్కి తన్నుతోంది. ఇళ్లచుట్టూ నడుం లోతున మురుగుతో కూడిన వరద చేరింది. ఈ దుర్వాసనకు ఇళ్లలో ఉండలేని పరిస్థితి. దోమలు, కీటకాల బెడద వెంటాడుతోంది. వందల వాహనాలు నాని పాడవుతున్నాయి. వ్యర్థాలు, జంతు మృత కళేబరాలతో ముంపు ప్రాంతాలు దుర్గంధంగా మారిపోయాయి. అయినా కీలక శాఖలు, ప్రజాప్రతినిధులకు పట్టడంలేదు. 15 ఏళ్లుగా విలీన పంచాయతీల్లో పాలకవర్గాలు లేకపోవడం బాధితులకు శాపంగా మారింది.

ఏర్పాట్లు చేస్తున్నాం:గ్రామీణ ప్రాంతాలకు పాలు, తాగునీటి సరఫరాతోపాటు రాకపోకలకు వాహనాలు, పడవలు ఏర్పాటు చేశామని జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ తెలిపారు. నగరంలో ముంపు సమస్య చక్కదిద్దేలా ధవళేశ్వరం వద్ద నీటిని తోడే యంత్రాల సామర్థ్యం పెంచుతామని నగర పాలక సంస్థ కమిషనర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

పాలు నీళ్లూ కూడా ఇవ్వలేదు:‘వారం రోజులుగా ముంపులోనే ఉన్నాం. అధికారులెవ్వరూ రాలేదు’ అని సావిత్రినగర్‌కు చెందిన పెదపూడి పద్మావతి ఆరోపించారు. ‘మొదటిరోజు ఒక పాల ప్యాకెట్‌ ఇచ్చారు. తర్వాత ఎవరూ తొంగిచూడలేదు. రెండురోజులు మంచినీళ్లు కూడా లేక ఇబ్బంది పడ్డాం’ అని నేతాజీనగర్‌కు చెందిన తాతపూడి సరస్వతి చెప్పగా, ‘నాలుగు రోజులుగా ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేకున్నా అధికారులు భోజనాలైనా ఏర్పాటుచేయలేదని నేతాజీనగర్‌ పదో వీధికి చెందిన వై.సుబ్బారెడ్డి తెలిపారు.

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద:సున్నిపెంట సర్కిల్‌, న్యూస్‌టుడే: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 69,780, సుంకేసుల జలాశయం నుంచి 1,10,184 క్యూసెక్కుల చొప్పున వరద నీరు శ్రీశైలానికి వస్తోంది. దీంతో బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి ఈ ప్రాజెక్టు నీటిమట్టం 877.60 అడుగులకు చేరింది. నీటి నిల్వ 176.3314 టీఎంసీలుగా నమోదైంది. కుడి, ఎడమగట్టు జల విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తి ద్వారా 29,927 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగô్కు విడుదల చేస్తున్నట్ల్లు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details