గుంటూరు జిల్లా తెనాలి... ఆంధ్రా ప్యారిస్ గా ఈ పట్టణానికి పేరుంది. కవులు, కళాకారులకు ప్రసిద్ధి చెందిన ఈ పట్టణం... ఇటీవలి కాలంలో స్వచ్ఛత విషయంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. నవ్యాంధ్రప్రదేశ్లో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించటంలో ముందుంటోంది. లక్షా 70వేల మంది జనాభా ఉన్న ఈ పట్టణంలో కొన్నేళ్ల కిందటి వరకూ.. పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉండేది. అయితే దేశవ్యాప్తంగా ప్రారంభమైన స్వచ్చభారత్ స్ఫూర్తిని తెనాలి..అందిపుచ్చుకుంది.
రాష్ట్రంలో తొలిసారి బయోటాయిలెట్లు
పరిశుభ్రతపై పురపాలక సంఘం బాగా శ్రద్ధపెట్టి ప్రజల్లో అవగాహన పెంచింది. ప్రజాప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో సహకరించారు. తడి చెత్త-పొడి చెత్త సేకరణ విధానాన్ని పకడ్బందీగా అమలు చేశారు. ఈ అంశం స్వచ్ఛత విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. మున్సిపాలిటి స్థాయిలోనే.. వ్యర్ధాల నిర్వహణను సమర్థంగా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోనే మున్సిపాలిటీ స్థాయిలో తొలిసారిగా బయోటాయిలెట్లను ఏర్పాటు చేసిన తెనాలి... నీటి వినియోగం అవసరం లేని మూత్రశాలలను కూడా ఏర్పాటు చేసింది.
మరింత కృషి చేయాలి..
పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి...పట్టణంలో ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూశారు. తెనాలి పట్టణం గుండా.. మూడు కాలువలు వెళుతుంటాయి. గతంలో వీటిని బహిరంగ మలవిసర్జనకు వినియోగించేవారు. ఇప్పుడు ఆ కాలువ కట్టలను పూలతోటలతో అందంగా ఆధునీకరించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించలేని చోట సామూహిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణను సైతం... మహిళా సంఘాలకు అప్పగించి.. ఎప్పటికప్పుడు వాటి నిర్వహణను.. కమిషనర్... వాట్సాప్ ద్వారా తెలుసుకుంటున్నారు. అయితే పలు చోట్ల కొన్ని సమస్యలున్నాయని..వాటిని పరిష్కరించేందుకు అధికారులు మరింత కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.