దూరప్రాంతాలకు ప్రయాణికుల్ని చేరవేయటంలో ఆర్టీసీకి సమాంతరంగా రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నడుస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి విశాఖపట్నంతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై మరికొన్ని నగరాలకు బస్సులు నడిచేవి. అయితే కరోనా లాక్ డౌన్ నుంచి బస్సులన్నీ గ్యారేజీలకే పరిమితమయ్యాయి. దాదాపు వెయ్యి వరకూ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. వీటిలో వివాహాలు, తీర్థయాత్రలకు వెళ్లేవి రెండు వందల వరకూ మినహాయిస్తే... మిగతావన్నీ ప్రయాణికుల్ని దూరప్రాంతాలకు చేరవేసేవే.
కేంద్రం అనుమతులు.. రాష్ట్రం పచ్చజెండా
అన్ లాక్-4లో భాగంగా రాష్ట్రాల మధ్య ప్రైవేటు ట్రావెల్స్ కు కేంద్రం అనుమతించింది. ఆ మేరకు రాష్ట్రప్రభుత్వం కూడా కొన్ని నియమ నిబంధనలు విధించి ప్రైవేటు బస్సులకు పచ్చజెండా ఊపింది. అయితే కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు మాస్క్ తప్పనిసరిగా ధరించేలా చూడాలని, థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ వంటి చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
ఇప్పుడిప్పుడే...
అయితే... కరోనా భయంతో మొదట్లో ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కేందుకే పెద్దగా ఆసక్తి చూపలేదు. అన్నిరకాల కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కావటంతో ఆర్టీసి బస్సులను కూడా అన్ని ప్రాంతాలకు నడుపుతున్నారు. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ కూడా పూర్తిస్థాయిలో నడిపేందుకు వాటి యజమానులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నారు. చెన్నైలో ఇంకా ప్రజారవాణాకు అనుమతి ఇవ్వకపోవటంతో అటువైపు సర్వీసులు లేవు. అలాగే మిగతా రాష్ట్రాల్లోని వివిధ నగరాలకు కూడా ప్రస్తుతానికి బస్సులు నడపటం లేదు.