ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

త్వరలో రాష్ట్రానికి తెలుగు విశ్వవిద్యాలయం: విద్యాశాఖ మంత్రి సురేష్‌ - Gidugu Ramamurthy Language Awards presented by Education Minister Suresh

తెలుగు భాషకు విశేష కృషి చేసిన 13 మంది భాషా కోవిదులకు.. గిడుగు రామమూర్తి పురస్కారాలు ప్రదానం చేశారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​.. వీటిని గ్రహీతలకు అందించారు.

Gidugu Ramamurthy Language Awards 2021
తెలుగు బాషా కోవిదులకు గిడుగు రామ్మూర్ భాషా పురస్కారాలు

By

Published : Aug 28, 2021, 5:10 PM IST

Updated : Aug 29, 2021, 12:19 PM IST

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో ఉండిపోయిన తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏపీలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సురేష్‌ తెలిపారు. గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 13 మంది భాషా కోవిదులకు గిడుగు రామమూర్తి పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమానికి మంత్రి సురేష్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తపాలాశాఖ రూపొందించిన ప్రత్యేక కవర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినా తెలుగును కచ్చితంగా బోధించాల్సిందేనని స్పష్టం చేశారు.

తెలుగు గొప్పతనాన్ని ఖండాంతరాలకు విస్తరింపజేసేందుకు ఎన్నారైల సహకారం తీసుకుంటామన్నారు. తెలుగుకు సంబంధించిన ప్రత్యేక కోర్సులు, డిగ్రీలను తీసుకురానున్నట్టు వెల్లడించారు. తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. తెలుగు, సంస్కృతం వేరు కాదని చెప్పారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ మాట్లాడుతూ.. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాన్ని ‘తిక్కన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం’గా పేరు మార్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎన్‌యూ వీసీ రాజశేఖర్‌, రెక్టార్‌ వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్‌ కరుణ, విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు ఆచార్య శలాక రఘునాథశర్మ, మొవ్వ వృషాద్రిపతి, కోడూరు ప్రభాకర్‌రెడ్డి, వాడ్రేవు సుందరరావు, ధూళిపాళ్ల రామకృష్ణ, డాక్టర్‌ కంపల్లె రవిచంద్రన్‌, డాక్టర్‌ ఉపద్రష్ట వేంకట రమణమూర్తి, సుధారాణి, జీఎస్‌ చలం, కెంగార మోహన్‌, షహనాజ్‌ బేగం, మల్లిపురం జగదీష్‌, పచ్చా పెంచలయ్యను సత్కరించారు.

Last Updated : Aug 29, 2021, 12:19 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details