శాసనమండలి ఛైర్మన్ పదవిని ఎస్సీ లేదా బీసీ వర్గానికి కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు వైకాపా వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఛైర్మన్ ఎంఏ షరీఫ్ మే 24న పదవీ విరమణ చేయనున్నారు. జూన్ 18నాటికి మండలిలో వైకాపా సంఖ్యాబలం 30 దాటనుంది. అందువల్ల ఛైర్మన్ పదవి ఆ పార్టీకే దక్కనుంది. ఈ కారణంగా.. ఆశావహులు 2 నెలల నుంచి ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.
ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్సీ ఒకరు తనకు ఛైర్మన్ పదవిని ఇవ్వాలంటూ గట్టి ప్రయత్నమే చేస్తున్నారని సమాచారం. ఆయన ఎమ్మెల్సీగా పదవీ కాలం జూన్‌లో ముగియనుంది. ఆయన్ను ఛైర్మన్‌ను చేయాలంటే మళ్లీ ఎమ్మెల్సీగా కొనసాగించాల్సి ఉంటుంది. ఆయనకు పార్టీ అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పష్టతా రాలేదని చెబుతున్నారు. ఛైర్మన్ పదవిని ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికిస్తే బాగుంటుందనే యోచనలో వైకాపా అధినాయకత్వం ఉందని సమాచారం. ఇప్పుడు షరీఫ్ పదవీ విరమణతో ఖాళీ అవుతున్న ఛైర్మన్ స్థానానికి అదే వర్గానికి చెందినవారికి ఇస్తే బాగుంటుందన్న వాదనా వైకాపాలో ఉంది.