దమ్ముంటే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు వైకాపా సిద్దం కావాలని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు సవాల్ విసిరారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా... సీఎస్ జోక్యం అనుచితమని విమర్శించారు. కొత్త జిల్లాల వంకతో ఎన్నికలు వాయిదా వేయాలని చూడటం పలాయన వాదమేనని మండిపడ్డారు. 73,74వ రాజ్యాంగ అధికరణలను గౌరవించి. ఎస్ఈసీ కోరినప్పుడు రాష్ట్ర యంత్రాంగాన్ని బదిలీ చేయాల్సిన బాధ్యత గవర్నర్దేనని యనమల పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కె(3) నిర్దేశించేదనందున గవర్నర్ .. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీకి సహకరించాలని సూచించారు.
ఓటమి భయంతోనే.. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలంటే వైకాపా వెనుకంజ వేస్తోందని యనమల ఆరోపించారు. కేంద్రానికి, ఇతర రాష్ట్రాలకు లేని కరోనా సాకులు వైకాపానే ఎందుకు చెబుతోందని ఆయన నిలదీశారు. బాధిత వర్గాలన్నీ వ్యతిరేకంగా ఓటేస్తారనేదే.. వైకాపా భయమని.. ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసిల్లో వ్యతిరేకత చూసే వెనక్కి తగ్గుతున్నారని ధ్వజమెత్తారు. నిష్ఫాక్షికంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతారనే.. వైకాపా భయమన్న యనమల.. పోలీసులను అడ్డుపెట్టుకుని మళ్లీ బెదిరించలేమనే వెనుకంజ వేశారని దుయ్యబట్టారు. గతంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలు పూర్తిగా రద్దు చేసి మళ్లీ తాజాగా అన్ని స్థానాలకు ఎన్నికలు జరపాలని యనమల డిమాండ్ చేశారు.