ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 21, 2021, 10:46 PM IST

Updated : Feb 22, 2021, 5:03 AM IST

ETV Bharat / city

పంచాయతీ ఎన్నికల ఫలితాలు... స్వల్ప ఆధిక్యంతో గెలుపు

క్షణక్షణం ఉత్కంఠ. ఫలితం తేలేవరకూ ఉద్విగ్నభరితం. దోబూచులాడిన అదృష్టం. ఒకే ఒక్క ఓటుతో ఐదేళ్ల నాయకత్వ అవకాశం దక్కించుకున్న సంబరమొకరిది.. ఓట్లు సమానంగా వచ్చి బొమ్మాబొరుసులో దురదృష్టం వెక్కిరించిన వారు మరొకరు. పదిలోపు ఓట్ల తేడాతోనే సర్పంచ్‌లుగా ఎన్నికై ఊపిరి పీల్చుకున్న వారు ఎందరో. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితమయ్యాయి.

Win of Sarpanch candidates by a slight margin in andhrapradhesh
పంచాయతీ ఎన్నికల ఫలితాలు... స్వల్ప ఆధిక్యంతో గెలుపు

గుంటూరు జిల్లాలో కేవలం ఒక్క అంకె ఓట్ల తేడాతోనే పలుచోట్ల సర్పంచ్‌ అభ్యర్థులను అదృష్టం వరించింది. అనుమర్లపూడిలో 1 ఓటుతో సుబ్బలక్ష్మి, పుట్లగూడెం సర్పంచ్‌గా 2 ఓట్లతో తోట పాపారావు, భీమినేనివారిపాలెంలో 3 ఓట్లతో ఆళ్ల శ్రీనివాసరావు గెలిచారు. గోరంట్ల సర్పంచిగా 3 ఓట్లతో మద్దిగుంట్ల వెంకయ్య విజయం సాధించారు. పుసులూరు సర్పంచిగా 9 ఓట్లతో పెద్ది రాధిక, అందుకూరులో 10 ఓట్లతో సౌభాగ్యలక్ష్మి సర్పంచయ్యారు. తోకవారిపాలెం సర్పంచ్‌గా 6 ఓట్లతో దొడ్డా సామ్రాజ్యం, దాసుపాలెంలో 11 ఓట్ల మెజార్టీతో ఆలపాటి వీరయ్య గెలిచారు. వైకుంఠపురంలో 17 ఓట్లతో విఠల్‌రావు విజయం సాధించారు.

ప్రకాశం జిల్లా అక్కపల్లెలో 7 ఓట్లతో సోమిరెడ్డి, చిన్నదోర్నాల సర్పంచిగా 9 ఓట్లతో పోలమ్మ గెలిచారు. నెల్లూరు జిల్లాలోని పైనంపురంలో కేవలం ఒకే ఓటుతో విజయకుమార్‌ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. రీకౌంటింగ్‌లో ఆధిక్యం 2 ఓట్లకు పెరిగింది. చిత్తూరు జిల్లా పాకాలలో 1 ఓటు తేడాతో కస్తూరి విజయం సాధించారు. మోదుగులపాళ్యంలో అభ్యర్థులకు సమాన ఓట్లు రాగా సందిగ్ధం ఏర్పడింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె గల గ్రామ పంచాయతీ కందులవారిపల్లెలో తెదేపా బలపరిచిన అభ్యర్థి గెలుపొందగా... ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

కృష్ణా జిల్లా బూతిమిల్లిపాడు సర్పంచిగా 4 ఓట్లతో సుబ్బారావు విజయం సాధించారు. తూర్పు గోదావరి జిల్లా గాడిలంక సర్పంచ్‌గా 10 ఓట్లతో పెద్దిరెడ్డి మునీంద్రరావు ఎన్నికయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నీలాద్రిపురంలో 3 ఓట్లతో అభ్యర్థి గెలిచారు. విశాఖ జిల్లా వెన్నెలపాలెంలో గతంలో 3 సార్లు సర్పంచ్‌గా పనిచేసిన తెదేపా నేత బండారు సత్యనారాయణ మూర్తి సతీమణి మాధవీలత... ఓడిపోయారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ సతీమణి రాంపురం పంచాయతీ సర్పంచ్‌గా విజయం సాధించారు. విజయనగరంలోని కొత్తవలస మేజర్‌ పంచాయతీలో కేవలం 10ఓట్ల తేడాతో ఫలితం తేలింది.

ఎంపీ సీఎం రమేశ్‌ స్వగ్రామమైన కడప జిల్లా ఎర్రగుంట్లలో భాజపా బలపరిచిన అభ్యర్థి 3వేల 734 ఓట్ల భారీ తేడాతో గెలుపొందారు. అనంతపురం జిల్లా మల్లుగూరులో ఇద్దరు అభ్యర్థులకూ 570 చొప్పున సమానంగా ఓట్లొచ్చాయి. అధికారులు టాస్ వేయగా... రమేశ్‌ అనే అభ్యర్థిని అదృష్టం వరించింది. కర్నూలు జిల్లా హనుమాపురం సర్పంచ్‌గా 10 ఓట్లతో ఇందిరమ్మ విజయం సాధించారు.

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికలు: వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ

Last Updated : Feb 22, 2021, 5:03 AM IST

ABOUT THE AUTHOR

...view details