గ్రంథాలయాలు ఆధునికతను సంతరించుకుని.. పుస్తక ప్రియులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంటున్నాయి. ఆ కోవలోకి చెందినదే విశాఖ ప్రజా గ్రంథాలయం. ప్రశాంత వాతావరణంలో రీడింగ్ రూమ్స్, ఆహ్లాదకరంగా ఉండేలా పచ్చదనం పెంపొందించారు. పిల్లలు, పెద్దలు, విద్యార్థులకు ఉపయోగపడేలా ఎన్నో పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నారు. కంప్యూటర్ ల్యాబ్స్, ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు. అన్నీ వసతులతో.. కార్పొరేట్ హంగులతో ప్రజా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దారు.
విశాఖలోని ప్రజా గ్రంథాలయాన్ని పూర్తిగా ఆధునిక సదుపాయాలతో ఆకర్షణీయంగా మార్చారు. విశాలమైన రీడింగ్ రూమ్స్, ఆహ్లాదకమైన వాతావరణం ఉండేలా గార్డెన్స్ ఏర్పాటు చేశారు. భవనంపైన సౌర ఫలకలు అమర్చి.. దాని ద్వారా ఉత్త్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రంథాలయానికి వినియోగిస్తున్నారు. పిల్లలు, పెద్దలు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఉపయోగపడేలా.. వేరువేరు సెక్షన్లుగా పుస్తకాలు అందుబాటులో పెట్టారు. ఆన్‌లైన్ పరీక్షలు రాసుకునేందుకు వీలుగా.. కంప్యూటర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసి, ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు.
ప్రజా గ్రంథాలయాన్ని అదనంగా ఎనిమిది వేల చదరపు అడుగులతో మరో అంతస్తులో విస్తరించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులే లక్ష్యంగా గ్రంథాలయాన్ని హరిత లైబ్రరీగా మార్చామని కన్వీనర్ D.S.వర్మ తెలిపారు. విద్యార్థులు ఆరుబయట కూర్చుని పచ్చదనం ఆస్వాదిస్తూ చదువుకునేలా సౌకర్యాలు కల్పించామన్నారు. దాదాపు యాభై వేలకు పైగా పుస్తకాలతో కొత్త విభాగాలు ఏర్పాటు చేశారు.