Telugu students in Ukraine : ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు విద్యార్థులు ఎవరూ సరిహద్దు ప్రాంతాలకు రావద్దని ఏపీలో ఉక్రెయిన్ టాస్క్‌ఫోర్సు కమిటీ ఛైర్మన్ ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. ఎక్కడివారు అక్కడే ఉండాలని, సాహసం చేసి సరిహద్దులకు వస్తే ఇబ్బందులు ఏర్పడతాయని హెచ్చరించారు. సచివాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం మ్యాప్ చేసిన ప్రాంతాల్లో ఎక్కడా పేలుళ్లు జరుగుతున్నట్లు ఫిర్యాదులు లేవు. ఉక్రెయిన్ నుంచి ముంబయికి ఈ రోజు (శనివారం) సాయంత్రానికి వచ్చే విమానంలో 9 మంది, రొమేనియా రాజధాని బుకారెస్టు నుంచి దిల్లీకి అర్ధరాత్రి 2.30 గంటలకు వచ్చే మరో విమానంలో 13 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ముంబయికి వచ్చే ఏపీ విద్యార్థులను ఐఆర్‌ఎస్ అధికారి రామకృష్ణ కలుసుకొని, ఏపీకి పంపుతారు. దిల్లీలో ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్‌ప్రకాశ్ ఆధ్వర్యంలో సమన్వయం చేస్తారు. దిల్లీ విమానాశ్రయంలో ఏపీభవన్ తరఫున సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ముందుగానే విమాన టికెట్ బుక్ చేసుకొని ఉంటే ఏపీకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తారు. లేదంటే ఏపీభవన్‌కు తీసుకువెళ్లి, అనంతరం రాష్ట్రానికి పంపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది. ఇప్పటి వరకు 360 మంది విద్యార్థుల వివరాలు నమోదయ్యాయి. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి, ఉక్రెయిన్ సరిహద్దు దేశాల్లోని మన రాయబార కార్యాలయ అధికారుల ఫోన్ నంబర్లు ఇస్తున్నాం. కేంద్ర విదేశాంగశాఖ సూచనలను వీరికి అందిస్తున్నాం. ఏపీ విద్యార్థులు ప్రధానంగా ఉక్రెయిన్‌లోని ఏడు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందారు. వీటికి సమీపంలోని రొమేనియన్ రాయబార కార్యాలయాన్ని ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నాం. ఉక్రెయిన్‌లో ఏటీఎంలు పని చేయడం లేదు. ఆహారం, తాగునీటికి ఇబ్బందులు ఉండొచ్చు. రెడ్‌క్రాస్‌లాంటి అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు సేవలు అందిస్తున్నాయి. ఉక్రెయిన్‌లోని ఏపీకి చెందిన నిపుణులు, వ్యాపారవేత్తలకు సంబంధించి రెండు ఫోన్‌కాల్స్ మాత్రమే వచ్చాయి. విద్యార్థుల నుంచే ఎక్కువ వస్తున్నాయి. ఉక్రెయిన్‌లో తెలుగువారు ఎంతమంది ఉన్నారు? ఎక్కడున్నారో వివరాలివ్వాలని ఉక్రెయిన్ రాయబార కార్యాలయాన్ని ఏపీ భవన్ కోరింది. హైదరాబాద్‌లోని కన్సల్టెన్సీల నుంచి విద్యార్థులు ఆ దేశానికి వెళ్లారు. వివరాల సేకరణకు ఐజీ స్థాయి అధికారిని టాస్క్‌ఫోర్సుకు అనుసంధానం చేయాలని డీజీపీని కోరాం’ అని వెల్లడించారు. ఈ సమావేశంలో టాస్క్‌ఫోర్సు కన్వీనర్ గితేష్‌శర్మ, సభ్యులు ఏపీ డెయిరీ అభివృద్ధి ఎండీ ఎ.బాబు, రైతుబజార్ల సీఈవో శ్రీనివాసరావు, ఏపీ ఎన్‌ఆర్టీసొసైటీ సీఈవో దినేష్‌కుమార్ పాల్గొన్నారు.
మైనస్ డిగ్రీల చలిలో.. కాలినడకన