హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రాజెక్టును చేపట్టడానికి ఏర్పాటు చేసిన వసంత ప్రాజెక్ట్స్‌లో వాటాలను ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. తోడల్లుడు వై.వి.సుబ్బారెడ్డికి బదలాయించారని.. ప్రతిఫలంగా కూకట్‌పల్లిలోని చిడ్కో (సైబరాబాద్ హైటెక్ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్)కు అదనంగా ఎలాంటి బిడ్ లేకుండా 15 ఎకరాలను నాటి ప్రభుత్వం నుంచి పొందారంటూ సీబీఐ హైకోర్టుకు నివేదించింది. ఎంబసీ కన్సార్షియం పేరుతో ప్రాజెక్టు పొందిన శ్యాంప్రసాద్ వసంత్ ప్రాజెక్ట్స్‌ను ఎస్పీవీగా చూపుతూ ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పింది. ఒప్పందం కుదిరేనాటికి కన్సార్షియంలోని భాగస్వాములకు ఎలాంటి వాటాలు లేవని, కేవలం వసంత్ ప్రాజెక్ట్స్ యజమాని వసంత కృష్ణప్రసాద్ తల్లి పేరుతో మాత్రమే కంపెనీ ఉందని తెలిపింది. గచ్చిబౌలి ప్రాజెక్టులో కృష్ణప్రసాద్, వై.వి.సుబ్బారెడ్డి సమాన భాగస్వాములని పేర్కొంది. ఇందూ- గృహనిర్మాణ మండలి వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వసంత్ ప్రాజెక్ట్స్‌తోపాటు దాని అధినేత, ఏపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు.
తప్పుడు పత్రాలు సృష్టించిన వసంత ప్రాజెక్ట్స్
సీబీఐ తరఫు న్యాయవాది కె.సురేందర్ వాదనలు వినిపిస్తూ గచ్చిబౌలిలో 4.29 ఎకరాల్లో నిర్మించిన విల్లాలను కృష్ణప్రసాద్, వై.వి.సుబ్బారెడ్డి తమ బంధువులకు కేటాయించుకుని లబ్ధి పొందారన్నారు. గృహనిర్మాణ మండలి నుంచి ప్రాజెక్టును పొందడానికి.. కృష్ణప్రసాద్ ఒత్తిడితో తప్పుడు పత్రాలు సృష్టించినట్లు వసంత ప్రాజెక్ట్స్ ఛార్టెడ్ అకౌంటెంట్ వాంగ్మూలం ఇచ్చారన్నారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఇందూ టెక్‌జోన్, గృహనిర్మాణ మండలి ప్రాజెక్టులను ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి పొందారని, ఇందుకు ప్రతిఫలంగా జగన్‌కు చెందిన కార్మెల్ ఏసియా హోల్డింగ్స్‌లో రూ.70 కోట్లు పెట్టుబడులు పెట్టారన్నారు. 48 మంది సాక్షులు, 6 వేల పత్రాల ఆధారాలతో అభియోగపత్రాన్ని దాఖలు చేశామన్నారు. అప్పటి గృహనిర్మాణ మండలి వీసీ మహంతితో కలిపి కుట్ర చేయడం ద్వారా గృహనిర్మాణ మండలికి నష్టం చేకూర్చి వ్యక్తిగతంగా లబ్ధి పొందారన్నారు. నిబంధనల ప్రకారం ప్రాజెక్టులను పూర్తి చేయలేదని.. ఎంఐజీ, ఎల్‌ఐజీ గృహాలను నిర్మించలేదని చెప్పారు. విచారణలో నేరం రుజువవుతుందని, అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. కృష్ణప్రసాద్ తరఫున సీనియర్ న్యాయవాది వినోద్ దేశ్‌పాండే సీబీఐ వాదనలను తోసిపుచ్చారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులతో ఎలాంటి సంబంధం లేదని, నిబంధనల ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేశామంటూ రాతపూర్వక వాదనలు సమర్పించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.