తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేందుకు శాయాశక్తులా పోరాడిన మహనీయుడు పీజేఆర్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డిని దోమలగూడలోని ఆయన నివాసంలో రేవంత్‌రెడ్డి కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక మొదటిసారి విష్ణును కలిసేందుకు వచ్చిన రేవంత్‌కు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
పీజేఆర్ ఆనాడే చెప్పారు..
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న కృష్ణజలాల విషయంలో వివాదం చెలరేగుతుందని పీజేఆర్... ఆనాడే హెచ్చరించారని గుర్తు రేవంత్ రెడ్డి చేశారు. పోతిరెడ్డిపాడు వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోతారని.. ఆనాటి సీఎం రాజశేఖర్‌రెడ్డితో కొట్లాడారని తెలిపారు. పోతిరెడ్డిపాడు తెలంగాణ పట్ల మరణశాసనమని ఆనాడే హెచ్చరించారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా... కృష్ణా నదీ జలాలు తెలంగాణ ప్రజల జన్మహక్కు అని పోరాడిన వ్యక్తి పీజేఆర్ అని తెలిపారు. కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను కాపాడేందుకు దిల్లీ వరకు వెళ్లి.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మాట్లాడారన్నారు. కృష్ణా జలాల విషయంలో కొట్లాడినందునే...వైఎస్సార్ ఆనాడు పి.జనార్దన్ రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకోలేదని ఆరోపించారు. సీఎల్పీ నేతగా అప్పటి ప్రభుత్వాలను గడగడలాడించిన వ్యక్తి పీజేఆర్ అని కొనియాడారు.
నగర ప్రజల గొంతు తడిపారు...
ప్రస్తుతం హైదరాబాద్‌లో తాగునీటి ఇబ్బంది లేదంటే.. దానికి ఏకైక కారణం పీజేఆర్ అని రేవంత్ పేర్కొన్నారు. తాగునీటి కష్టాలు పారద్రోలడానికి... కృష్ణాజలలాను సాగర్ నుంచి తెచ్చి భాగ్యనగర ప్రజల గొంతు తడిపిన కృషీవలుడు పీజేఆర్ అని తెలిపారు. వేసవి వచ్చిందంటే చాలు పదిరోజులకోసారి మంచినీళ్లు రావటం... నీళ్ల ట్యాంకర్ల దగ్గర బిందెలతో కొట్లాటలు.. ఇవన్నీ చూసి చలించిపోయారని గుర్తుచేసుకున్నారు. కృష్ణా జలాలను హైదరాబాద్ తాగునీటి కోసం తరలించాలని ఆయన పోరాటం వల్లే నీటి సమస్య పరిష్కారమైందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటికీ నగరంలోని బస్తీ ప్రజలు పీజేఆర్‌ను దేవునిలా కొలుస్తున్నారంటే.. ఆయన సేవలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. పీజేఆర్ సేవలను అందరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరముందన్నారు.