Telangana Rains news : తెలంగాణలో సోమవారం రాత్రి పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని... రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జనగాం, యాదాద్రి జిల్లాల్లోనూ మాదిరి వాన పడుతుందని పేర్కొంది. పలుచోట్ల వడగళ్లతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తుందని వెల్లడించింది. హైదరాబాద్‌లోనూ వర్షం కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ... పిడుగులతో కూడిన వర్షం పడొచ్చని హెచ్చరించింది.
అక్కడక్కడా మాదిరి వర్షాలు
రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు... అదే విధంగా బుధవారం నాడు ఆదిలాబాద్, కుమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. సోమవారం నాడు ఉపరితల ద్రోణి ఉత్తర కర్ణాటక నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9కిమీ ఎత్తు వద్ద ఏర్పడిందన్నారు.
సిద్దిపేటలో వాన
సిద్దిపేట పట్టణంలో మోస్తారు వర్షం కురిసింది. పట్టణంలోని రోడ్లు తడిసి ముద్దయ్యాయి. రోడ్లమీదకు వరద రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముంపు ప్రాంతాలు జలమయం అయ్యాయి.