అమరావతి కోసం.. అమెరికాలో గళమెత్తిన ప్రవాసాంధ్రులు - undefined
అమరావతి ఆందోళనలు ఖండాంతరాలు దాటుతున్నాయి. అమెరికాలోని ఉత్తర కరోలినాలోనూ.. అమరావతి కోసం సమావేశం జరిగింది. రాజధాని రైతుల పోరాటానికి సంపూర్తి మద్దతు తెలిపిన ప్రవాసాంధ్రులు.. 3 రాజధానులతో ప్రజలకు నష్టమే అని అభిప్రాయపడ్డారు.

అమరావతి కోసం అమెరికాలోనూ ఆంధ్రులు గళమెత్తుతున్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను.. అంతర్జాతీయ స్థాయిలో తెలియజేస్తున్నారు. ఉత్తర కరోలినా నగరంలో సమావేశమైన సుమారు 150 మంది ప్రవాసాంధ్రులు.. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని తీర్మానించారు. భవిష్యత్ తరాల కోసం పోరాడుతున్న వృద్ధులు, మహిళలను మనస్ఫూర్తిగా అభినందించారు. అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్ లో పోరాడుతున్న ఎంతో మంది నేతలు, ఐకాస ప్రతినిధులు, ప్రముఖులు.. ఈ సమావేశంలో వీడియో కాల్ ద్వారా సంభాషించారు. అభిప్రాయాలు పంచుకున్నారు. మూడు రాజధానులు వస్తే కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేయాలని ప్రవాసాంధ్రులు వారిని కోరారు. అమరావతి కోసం జరుగుతున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అమరావతే మన అజెండా కావాలని నినదించారు. తెదేపా అధినేత చంద్రబాబు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు.