'రాజ్యసభ రద్దు చేస్తే ఎలా ఉంటుందో తెలుసా?' - రాజధాని అమరావతిపై లోక్‌సభలో తెదేపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగం
రాష్ట్రంలో 3 రాజధానుల ఏర్పాటు ప్రతిపాదనను మరోసారి లోక్సభ దృష్టికి తీసుకువచ్చారు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్. ఇది రాష్ట్ర సమస్య కాదని.. జాతీయ సమస్యగా గుర్తించి కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా... రాజధాని అమరావతి అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తారు తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని... దీని వల్ల ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర సమస్యగా కాకుండా జాతీయ సమస్యగా గుర్తించి జోక్యం చేసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గల్లా ప్రసంగిస్తున్నంతసేపు వైకాపా ఎంపీలు నిరసన తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను పార్లమెంట్‌లో ప్రస్తావించొద్దని సూచించారు. అయినా జయదేవ్ తగ్గలేదు. మూడు రాజధానులతో దేశానికే ముప్పు వాటిల్లుతుందని గళమెత్తారు. ఈ నిర్ణయాన్ని జాతీయ పత్రికలు దుయ్యబట్టిన సంగతిని సభకు వివరించారు.