Chandrababu fire on YSRCP: రాష్ట్ర విభజన కంటే.. సీఎం జగన్ రెడ్డి పాలన వల్ల రాష్ట్రం కోలుకోలేని విధంగా నష్టపోయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ 30 నెలల పాలనలో.. రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వల్ల ప్రపంచం నష్టపోతే, జగన్ పాలన వల్ల ఏపీ నష్టపోయిందన్నారు. కరోనాకు వ్యాక్సిన్ ఉంది.. కానీ సీఎం జగన్ పాలనకు ఎలాంటి వ్యాక్సిన్ లేదని అన్నారు. రాష్ట్రానికి ప్రధాన ముద్దాయి.. 5 కోట్ల ప్రజల్ని దగా చేసి మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డేనని చంద్రబాబు దుయ్యబట్టారు. వంగవీటి రాధాపై రెక్కీ చేస్తే ఆధారాల్లేవన్నారన్న ఆయన.., తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇస్తే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పులు చేస్తున్నందువల్లే జీవోలను దాచి పెడుతున్నారని అన్నారు.
కేసుల నుంచి తప్పించుకునేందుకే సీఎం దిల్లీ టూర్..
వివేకా హత్య, సీబీఐ, ఈడీ కేసుల నుంచి తప్పించుకునేందుకే సీఎం దిల్లీ పర్యటన అని అన్నారు. కేంద్రం మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి హామీలు ఏమయ్యాయని నిలదీశారు. వివేకా హత్యకేసులో వెన్నంటే ఉన్నట్లు సోదరిని నమ్మించి అధికారంలోకి రాగానే ఎదురుదాడికి దిగారని ఆరోపించారు. వివేకా కూతురు మీదే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారన్నారు. ప్రత్యేక హోదా.. విభజన సమస్యలపై ఎంపీలంతా రాజీనామా చేద్దామంటే వైకాపా మాట్లాడడం లేదని మండిపడ్డారు. సీపీఎస్ రద్దు అంటే.. తెలియక హామీ ఇచ్చేశామంటున్నారని విమర్శించారు. రూ. 7 లక్షలకు పైగా అప్పు చేసి.. బావితరాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొనే దుస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోవాలనే విపరీత ధోరణి జగన్ రెడ్డిదన్నారు. కేంద్ర నిధులకు కొత్త పేర్లు పెట్టి.. ఏదో ఇచ్చేశామని జగన్ చెప్పుకుంటున్నారని చంద్రబాబు ఆక్షేపించారు.
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం సరికాదు..
వైకాపా పాలనతో ప్రజలంతా నష్టపోతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతీ ఒక్కరూ ఆలోచించాలని.. జరిగిన పరిణామాలను అవగతం చేసుకోవాలని సూచించారు. విధ్వంసంతోనే సీఎం జగన్ పాలనను ప్రారంభించారన్నారు. అలాగే ప్రజల కోసం కట్టిన ప్రజావేదికను కూల్చారని ఆరోపించారు. ప్రజల ఆస్తి విధ్వంసంతోనే ఉన్మాదం బయటపడిందని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. విధ్వంసానికి కొనసాగింపుగా మూడు రాజధానులు తీసుకొస్తామన్నారని మండిపడ్డారు. భూములిచ్చిన పాపానికి రైతులంతా ఎన్నో అవమానాలు భరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు సైబరాబాద్‌ని గ్రాఫిక్స్ అని ఉంటే.. ఇవాళ అభివృద్ధి ఉండేదా అని నిలదీశారు. అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేయిస్తున్నారని ఆక్షేపించారు.
ప్రభుత్వం పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయగలదా?
రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని... వారిచ్చిన భూమితో చేపట్టిన నిర్మాణాన్ని నాశనం చేస్తున్నారని వాపోయారు. ఎన్నికలకు ముందు అమరావతే ఏకైక రాజధాని అని చెప్పి మాట తప్పారన్నారు. భూములిచ్చిన పాపానికి రైతులు అవమానాలు ఎదుర్కోవలసి వస్తోందని... కోట్ల ఆస్తిని విధ్వంసం చేస్తున్నప్పుడు ప్రజా చైతన్యం ఎంతో అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి, పోలవరం అభివృద్ధి చెందితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందన్నారు. పోలవరం డీపీఆర్‌ను ఎందుకు ఖరారు చేయలేకపోయారని ప్రశ్నించారు. 2021 డిసెంబర్‌కు పోలవరం పూర్తి చేస్తామని చెప్పి.. ఇప్పటికీ చేయలేకపోయారన్నారు. పోలవరం పూర్తి చేయటం వైకాపా ప్రభుత్వానికి సాధ్యమా అని నిలదీసిన చంద్రబాబు.. దానిపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు.