మహిళలు, బాలలపై జరిగే క్రూరమైన, లైంగిక నేరాల్లో సత్వర దర్యాప్తు, వేగవంతమైన న్యాయవిచారణ, కఠిన శిక్షలకు వీలుగా ప్రభుత్వం తెచ్చిన 'దిశ' బిల్లులు చట్టబద్ధతను పొందలేకపోతున్నాయి. ఈ బిల్లుల్లో ఇండియన్ పీనల్ కోడ్-1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్-1973కు సవరణలు చేసినందున చట్టరూపం దాల్చాలంటే రాష్టపతి ఆమోదం తప్పనిసరి. ఈ ప్రక్రియలో భాగంగా బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించగా సంబంధిత మంత్రిత్వశాఖలు పలు ప్రశ్నలు లేవనెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సమాధానాలు సంతృప్తికరంగా లేవంటూ సమగ్ర వివరణలు కోరుతూ కేంద్రం వాటిని తిప్పి పంపిస్తోంది. ఏడాదిన్నరగా ఇదే తంతు నడుస్తోంది. తాజాగా బిల్లులపై అభ్యంతరాలన్నింటినీ క్రోడీకరించి కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. వాటికి రాష్ట్రప్రభుత్వం సమాధానాల్ని సిద్ధం చేసింది. ఈ సారైనా కేంద్రం సంతృప్తి చెందితే బిల్లులకు చట్టబద్ధత దక్కుతుంది.
శాస్త్రీయ ఆధారాల సేకరణ సాధ్యమా
దిశ బిల్లులపై కేంద్రం పలు కీలక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. లైంగిక నేరగాళ్ల జాబితాను రూపొందించి డిజిటలైజ్ చేస్తామని బిల్లులో ఉంది. ఆ వివరాలు దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం పేర్కొంది. నేరస్థులవి కాకుండా నిందితులందరి వివరాలు ఎందుకని కేంద్రం ప్రశ్నించింది. ఒక ఘటన జరిగిందని బాధితుల పేరుతో చట్టాలు తేవడం ప్రారంభిస్తే.. ఐపీసీ మొత్తం పేర్లతోనే నిండిపోతుంది కదా అని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. నేరం జరిగిన వారం రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి, ఛార్జిషీట్ వేయాలంటే అంత తక్కువ వ్యవధిలో శాస్త్రీయ ఆధారాల సేకరణ సాధ్యమా అని కేంద్రం అడిగింది. న్యాయనిరూపణ సరిగ్గా జరగక.. దోషి తప్పించుకోవచ్చు లేదా హడావుడి దర్యాప్తు వల్ల నిర్దోషులు ఇరుక్కోవచ్చు కదా? అని ప్రశ్నించింది. అలాగే ఐపీసీ(ipc)లో అదనంగా సెక్షన్లు జోడించడం, ఇప్పుడున్న సెక్షన్లలోని శిక్షల్ని పెంచడం ఎలా సాధ్యమని.. అవసరమైతే రాష్ట్ర స్థానిక చట్టాలు చేసుకోవచ్చు కదా అని కేంద్రం ప్రశ్నించింది.
వాటికి రాష్ట్రపతి ఆమోదం అవసరం
2019 నవంబర్ 28న హైదరాబాద్ శివారులో దిశ హత్యాచార ఘటన జరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిశ బిల్లులు రూపొందించింది. ఈ తరహా నేరాల్లో 7 రోజుల్లో పోలీసుల దర్యాప్తు, 14 రోజుల్లో న్యాయవిచారణ, 21 రోజుల్లో శిక్ష వేయించడం, ఈ కేసుల సత్వర న్యాయవిచారణకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు వీలు కల్పిస్తూ బిల్లులు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు- క్రిమినల్ లా ( ఏపీ సవరణ ) బిల్లు- 2019, ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు- ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, బాలలపై జరిగే నిర్దేశిత నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల బిల్లు-2019 పేరిట రెండు బిల్లులు రాష్ట్ర ఉభయసభల్లో 2019 డిసెంబర్ 16 నాటికి ఆమోదం పొందాయి. క్రిమినల్ లా, క్రిమినల్ ప్రొసీజర్స్, న్యాయ పరిపాలన అంశాలు ఉమ్మడి జాబితాలో ఉన్నందున వీటి చట్టబద్ధతకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 254(2) ప్రకారం రాష్ట్రపతి ఆమోదం అవసరం.