సోలార్, విండ్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ శివారు మహేశ్వరంలోని ఈ-సిటీలో ప్రముఖ సోలార్ పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ నూతన ప్లాంట్ ప్రారంభోత్సంవంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. రూ. 483 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌లో 750 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ సెల్, 750 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ మాడ్యూళ్ల తయారీని కంపెనీ చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతుల ప్రక్రియ, ల్యాండ్ అలాట్మెంట్ జరిగిన 18 నెలల రికార్డు సమయంలోనే ఈ తయారీ యూనిట్‌ను కంపెనీ ఏర్పాటు చేసింది. ప్రస్తుత ప్లాంట్ ద్వారా 700 మందికి ఉపాధి కల్పిస్తామన్న కంపెనీ.. ఇందులో 80 శాతం ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకే కేటాయిస్తామని ప్రకటించింది. మరో రెండేళ్లలో పెట్టుబడులను రూ. 1200 కోట్లకు పెంచి 4 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ సెల్, సోలార్ మాడ్యూల్ తయారుచేసేలా తెలంగాణలో విస్తరిస్తామని కంపెనీ ప్రకటించింది.
దేశంలోనే రెండో స్థానం
సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని కేటీఆర్ అన్నారు. సోలార్ సెల్స్, మాడ్యుల్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్న ప్రీమియర్ ఎనర్జీస్‌ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.
"కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ 18 నెలల రికార్డు సమయంలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ సెల్, మాడ్యుల్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటుచేయటం అభినందనీయం. ఉపాధి కల్పన ప్రతి ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్. ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీల నియామకం చేసుకుంటూనే, ప్రైవేటు రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నాం. గడిచిన ఏడేళ్లలో రాష్ట్రం 15 వేల పైచిలుకు పరిశ్రమలను, తద్వారా 2 లక్షల 20 వేల కోట్ల పైచిలుకు పెట్టుబడులను సాధించుకుంది. ఇందులో 80 శాతానికి పైగా పరిశ్రమలు ఇప్పటికే పని ప్రారంభించడం అసాధారణం." -కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి