power problems in ap: డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. మొత్తం అప్పులు రూ.37 వేల కోట్లకు చేరుకున్నాయి. వీటికి వడ్డీలు కట్టడానికి మళ్లీ రుణాలు తెస్తున్నాయి. ఫలితంగా జెన్‌కో (విద్యుత్ ఉత్పత్తి సంస్థల)లకు సైతం విద్యుత్తు బిల్లులను చెల్లించలేని దుస్థితికి చేరుకున్నాయి. తాజాగా ఎన్‌టీపీసీకి రూ.350 కోట్లను చెల్లించలేక రాష్ట్రాన్ని చీకట్లలో నెట్టాయి. డిస్కంలు ఇంతగా ఆర్థిక కష్టాలు అనుభవించడానికి ప్రధాన కారణమేంటి? ఒకవైపు వినియోగదారుల తమ బిల్లులను గతంలోకంటే చక్కగా చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు వారు విద్యుత్ కోతల కష్టాలను ఎందుకు భరించాల్సి వస్తోంది? ఈ కోతల పాపం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. డిస్కంల అప్పుల్లో రూ.24 వేల కోట్ల బకాయిలు ప్రభుత్వానివే కావడం గమనార్హం.
ఇదీ అసలు కారణం..
వివిధ వర్గాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకాలకు ప్రతినెలా సుమారు రూ.800 కోట్ల విలువైన విద్యుత్ వినియోగం అవుతోంది. ఈమేరకు ప్రభుత్వం నెలనెలా డిస్కంలకు చెల్లిస్తే సమస్యే ఉండదు. కానీ... ప్రతినెలా కొంత చొప్పున ఏటా సుమారు రూ.2-3 వేల కోట్లను బకాయి పెడుతోంది. దీంతో డిస్కంలు ఇంతే మొత్తంలో అంటే రూ.3 వేల కోట్ల వరకు అప్పులు తెస్తున్నాయి.
పక్కాగా వినియోగదారుల బిల్లుల వసూళ్లు..
డిస్కంలు ప్రతినెలా సుమారు 4,923 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను విక్రయిస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ విద్యుత్ సబ్సిడీ పథకాలు, ప్రభుత్వ విభాగాలకు 1,076 ఎంయూలను ఇస్తున్నాయి. మిగిలిన 3,847 ఎంయూలను వివిధ కేటగిరీల వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి. ఈ మొత్తం విద్యుత్‌కు ప్రతినెలా రూ.4,052 కోట్ల బిల్లులు అందాలి. ప్రభుత్వ సబ్సిడీ పథకాలకు వచ్చే రూ.800 కోట్లు పోను మిగిలిన విద్యుత్‌కు వినియోగదారుల నుంచి బిల్లుల రూపంలో పక్కాగానే వసూలవుతోంది. ఇలా 2021 ఏప్రిల్ నుంచి నవంబరు నాటికి డిస్కంలకు రూ.26,072 కోట్లు బిల్లు రూపేణా వసూలు కావాలి. పాత బకాయిలు కూడా కలిపి రూ.28,016 కోట్లు వసూలయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇదే వ్యవధిలో వసూలయ్యే మొత్తంతో పోలిస్తే సుమారు 9% వసూళ్లు పెరగడం గమనార్హం.
ప్రభుత్వ బకాయిలే రూ.24 వేల కోట్లు..
2021 నవంబరులో వివిధ సబ్సిడీ విద్యుత్ పథకాల కింద ప్రభుత్వం సుమారు రూ.744 కోట్లను డిస్కంలకు చెల్లించాలి. కానీ, రూ.443 కోట్లే ఇచ్చింది. అంటే ఒక్క నెలలోనే రూ.301 కోట్ల బకాయి పెట్టింది. 2021 ఏప్రిల్ నుంచి నవంబరు వరకు వివిధ ప్రభుత్వ సబ్సిడీ పథకాలకు సరఫరా చేసిన విద్యుత్‌కు రూ.5,946 కోట్లు ప్రభుత్వం నుంచి డిస్కంలకు రావాలి. ఇందులో రూ.5,122 కోట్లను మాత్రమే చెల్లించింది. ఎనిమిది నెలల్లోనే రూ.824 కోట్లు బకాయి పెట్టింది. పాత బకాయిలు రూ.14,034 కోట్లతో కలిపితే ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తం రూ.14,859 కోట్లకు చేరింది.
- ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థలు వినియోగించిన విద్యుత్‌కు ఛార్జీల రూపేణా రావాల్సిన బకాయిలు మరో రూ.9,069 కోట్లు ఉన్నాయి.
- ప్రభుత్వ సబ్సిడీ పథకాలు, ప్రభుత్వ విభాగాల వినియోగించి విద్యుత్‌కు ఛార్జీలు కలిపి రూ.23,928 కోట్లు నుంచి డిస్కంలకు రావాలి.