కరోనా నుంచి రాష్ట్రం కోలుకోక ముందే నివర్ తుపాను రూపంలో రైతులు తీవ్రంగా నష్టపోవడం.. చాలా బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు, నెల్లూరు, కడప, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పార్టీ నాయకులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు 12 లక్షల ఎకరాలకుపైగా పంట నష్టం వాటిల్లగా.. రైతులు కంటతడి పెడుతున్నారన్నారు. వరి, పత్తి, మిరప, పొగాకు, శనగ, వేరుశనగ, అరటి, పండ్లతోటలు, ఉద్యానపంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. కొన్నిచోట్ల పశు సంపద కోల్పోవడమూ దురదృష్టకరమన్నారు.
తుపాను ప్రభావంతో జరిగిన నష్టం, రైతులు పడుతున్న ఇబ్బందులను.. క్షేత్రస్థాయిలో నేతలను అడిగి పవన్ తెలుసుకున్నారు. మళ్లీ అధికారంలోకి ఎలా రావాలో ఆలోచించారే కానీ.. తుపాను హెచ్చరిక, పునరావాస కేంద్రాల బలోపేతంపై శ్రద్ధపెట్టలేదని పాలకులపై మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేంద్రం ఇచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేసి ఉంటే.. సగం సమస్యలు పరిష్కారమయ్యేవని ప్రభుత్వాన్ని విమర్శించారు. తుపానును ఎదుర్కోవడంలో ఏపీ విఫలమవడంపై సమగ్ర నివేదిక తయారు చేసి కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు.. డిసెంబర్ 2వ తేదీన తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.