తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక(TS MLA quota MLC Election) నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వారిలో ఆరుగురు తెరాస అభ్యర్థులు నామపత్రాలు సమర్పించగా.. మిగిలిన ఇద్దరు శ్రమజీవి పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ నామినేషన్లను రేపు పరిశీలించనున్నారు.
తెరాస అభ్యర్థులు ఆరుగురు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీతెరాస అభ్యర్థులు(TRS MLC candidates for MLA quota) ఖరారయ్యారు. ఆరు స్థానాలకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బండా ప్రకాశ్, వెంకట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరి పేర్లను అధిష్ఠానం ప్రకటించింది. మధ్యాహ్నం వీరు తమ నామినేషన్లు సమర్పించారు.
చివరి నిమిషంలో ఇద్దరు
జాబితాలో చివరి నిమిషంలో బండా ప్రకాశ్, వెంకట్రామ్ రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఈటల సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాశ్‌కు మంత్రి పదవి దక్కనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక కోసం భారీ కసరత్తే జరిగింది. జాబితాలో ఆకుల లలిత కొనసాగింపుతోపాటు మధుసూధనాచారికి అవకాశం లభిస్తుందనే ఊహాగానాలు రాగా.. చివరి నిమిషంలో అంతా తారుమారైంది. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.