ఉపాధిహామీ కూలీలకు వేతనాల చెల్లింపులు ఆలస్యం అవుతుండటంతో.. ఆ ప్రభావం ప్రస్తుత పనులపై కనిపిస్తోంది. కూలీల హాజరు క్రమంగా తగ్గుతోంది. గత ఏడాది ఇదే నెలలో హాజరైన కూలీలతో పోలిస్తే 35-40% తక్కువగా వస్తున్నారు. ఉపాధి కూలీలకు రెండునెలలుగా రూ.400 కోట్లకు పైగా చెల్లింపులు నిలిచిపోయాయి. రాష్ట్రానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో ఈ ఏడాది పనిదినాల కేటాయింపుల్లో కేంద్రం భారీగా కోత విధించింది. తొలి విడతగా 25 కోట్ల పనిదినాలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా, 14 కోట్లే కేటాయించింది. ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు నెలల్లోనే (ఏప్రిల్-జూన్) వీటిని వినియోగించారు. ఇప్పటివరకు 15.68 కోట్లకు పైగా పనిదినాలు కల్పించారు. నరేగా చట్టప్రకారం ఏడాదిలో ఒక్కో కుటుంబానికి వంద పనిదినాలు కేటాయించాలి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా మండలాల్లో ఉపాధి పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా వేతనాల చెల్లింపుల్లో జాప్యంతోనే కూలీలు ఈ పనులకు రావట్లేదు.
శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని మండలాల్లో 8, 9 వారాల వేతనాలు చెల్లించాలి. అనంతపురం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో 6 నుంచి 8 వారాల వేతనాలు ఇవ్వాలి. గతంలో 3 నుంచి 4 వారాలకోసారి చెల్లింపులు జరిగేవి. కేంద్రం నుంచి నిధుల కేటాయింపుల్లో జాప్యమైన విషయాన్ని అధికారులూ అంగీకరిస్తున్నారు. అదనపు పనిదినాల కోసం కేంద్రంతో చేస్తున్న సంప్రదింపులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సాధారణంగా రాష్ట్ర అధికారులను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ దిల్లీకి పిలిపించి అదనపు అవసరాలపై సమీక్షించి కేటాయిస్తుంది. ఇప్పటివరకూ దిల్లీ నుంచి అలాంటి పిలుపు రాలేదని తెలుస్తోంది.