MIG Layouts: ప్రభుత్వ భూముల్లో మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) కోసం లేఅవుట్లు వేసి మార్కెట్ ధర కంటే తక్కువకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు రూటు మార్చింది. ఇప్పటివరకు పనులు ప్రారంభించిన చోట లేఅవుట్లు అభివృద్ధి చేసి, మిగిలిన చోట్ల ప్రైవేటు స్థిరాస్తి వ్యాపార భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
ప్రభుత్వ భూమి లేనిచోట ప్రైవేటు భూములు కొని లేఅవుట్లు అభివృద్ధి చేసి.. అందుబాటు ధరల్లో మధ్యతరగతికి ఇళ్ల స్థలాలు కేటాయించడం సాధ్యం కాదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఇలాంటి చోట సొంత స్థలాల్లో లేఅవుట్ల అభివృద్ధికి ముందుకొచ్చే వ్యాపారులను ఆహ్వానించనున్నారు. వారు అభివృద్ధి చేసిన లేఅవుట్లలో 40% ప్లాట్లను ప్రభుత్వానికి కేటాయించాలి. వీటిని మార్కెట్ ధర కంటే 10-15% తక్కువకు మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం విక్రయిస్తుంది.
ప్లాట్ ధరలో 4% ప్రొసెసింగ్ ఛార్జీల కింద ప్రభుత్వం మినహాయించుకొని మిగతా మొత్తాన్ని వ్యాపారులకు తిరిగి చెల్లిస్తుంది. లేఅవుట్‌లోని మిగతా 60% ప్లాట్లను వ్యాపారులు తమకు నచ్చిన ధరకు విక్రయించుకోవచ్చు. ఈ మేరకు మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయి.
వ్యాపారులకు శరవేగంగా అనుమతులు..ప్రభుత్వ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసే ఎంఐజీ లేఅవుట్లకు యుద్ధప్రాతిపదికన అనుమతులిచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు (గ్రీన్ ఛానల్) చేస్తోంది. భూ వినియోగ మార్పిడి, లేఅవుట్‌కు అనుమతులు.. ఇలా అన్ని దశల్లోనూ వారం నుంచి పది రోజుల్లో అనుమతులు ఇవ్వనున్నారు.