"నాన్నా నన్ను క్షమించు.. ఎంతో ఊహించుకున్నా.. వీడు నన్ను మోసం చేశాడు.. భరించలేకపోతున్నా.. వెళ్లిపోతున్నా.." అంటూ తండ్రికి, "నేను ఏ తప్పూ చేయలేదు. నన్ను క్షమించురా! పెళ్లి పేరుతో వాడు మోసం చేశాడు. ఇంకా రెండేళ్లు ఆగమంటున్నాడు.. నేను చనిపోతున్నా!"అంటూ సోదరుడికి సెల్ఫీ వీడియోలు పంపి ఓ యువతి తనువు చాలించింది. హైదరాబాద్ మీర్‌పేటకు చెందిన ఐశ్వర్య (20) అనే యువతికి మియాపూర్‌కు చెందిన మారెడ్డి అశిర్ (21) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. ఖైరతాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో టెలికాలర్‌గా పనిచేసే అశిర్ స్నేహం, ప్రేమ పేరుతో ఐశ్వర్యకు దగ్గరయ్యాడు.
గతేడాది ఫిబ్రవరిలో పెద్దలకు తెలియకుండా ఇద్దరూ ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. నెలపాటు ఖైరతాబాద్‌లో ఓ గది అద్దెకు తీసుకుని ఉన్నారు. అశిర్ ఉద్యోగం వదిలేయడమే కాకుండా యువతిని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. ఆ విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు వచ్చి వారిని మందలించారు. ముందుగా జీవితంలో స్థిరపడాలని సూచించారు. ఆమె గర్భవతి అయినట్లు తెలుసుకున్న అశిర్ గర్భస్రావం చేయించాడు. దీంతో ఐశ్వర్య మరింత కుమిలిపోయింది. 20 రోజుల నుంచి ఆమె బంజారాహిల్స్‌లోని ఓ పేయింగ్ గెస్ట్‌హౌస్‌లో మరో ఇద్దరు యువతులతో కలిసి విడిగా ఉంటోంది.