పనుల్లేక పేద, మధ్య తరగతి వర్గాల ఆదాయం పడిపోతుంటే.. నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయి. ఏడాది కిందటితో పోలిస్తే నూనెల ధరలు 25% పైగా పెరిగాయి. వేరుసెనగ నూనె ధర మూడేళ్ల కిందటితో చూస్తే ఏకంగా 50 శాతం పెరిగింది. కిలో రూ.100కు పైగా చేరడంతో పప్పులూ ఉడకడం లేదు. చింతపండు కిలో రూ.250 వరకు చేరింది. కరోనా లాక్‌డౌన్‌తో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సరకుల నిల్వలు నిండుకోగా.. ఇటీవలి వానలకు స్థానికంగానూ కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మార్కెట్‌లో అన్నింటికీ కొరత ఏర్పడి ధరలపై ప్రభావం పడింది. లాక్‌డౌన్ తర్వాత సామాన్యుల కొనుగోలు శక్తి పడిపోయిన తరుణంలో వంటింటి సరకులు ప్రియం కావడం ఇంటి బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది.
వానలు కురిసి.. నూనెలు ఎగిసి..
వంట నూనెలకు చైనా, పాకిస్థాన్, యూరోపియన్ దేశాల్లో డిమాండ్ అధికం. మన దేశం నుంచే డిసెంబరులోగా 90 వేల టన్నుల వేరుసెనగ నూనె చైనాకు ఎగుమతి చేయాల్సి ఉంది. దీంతో దేశీయంగా ధరలు పెరిగాయి. 20 టన్నుల ట్యాంకర్ కొంటే సగటున లీటరుకు రూ.147 వరకు అవుతోంది. ఇది చిల్లర మార్కెట్‌కు వచ్చేసరికి మరింత పెరుగుతోంది. భారీవర్షాలతో ఈసారి దిగుబడి తగ్గడంతో వేరుసెనగ కాయలకూ కొరత ఏర్పడింది. అయినా రాష్ట్రం నుంచి గుజరాత్, మహారాష్ట్రలకు ఎగుమతి చేస్తున్నారు. ఆముదం ధరలు కూడా ఎగిశాయి. ప్రస్తుతం వేరుసెనగ నూనె కిలో రూ.160, పొద్దుతిరుగుడు రూ.120, పామోలిన్ రూ.100 ధర పలుకుతున్నాయి.
చింతపండు గతేడాదితో పోలిస్తే కిలోకు రూ.60 వరకు హెచ్చింది. కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లో కిలో రూ.250గా ఉంది. గతేడాది పంట ఉత్పత్తి తగ్గడం, తాజా డిమాండ్ దృష్ట్యా శీతల గిడ్డంగుల్లోని పండును రవాణా చేస్తున్నారు. కరిపులి రకం క్వింటాలు రూ.1,800-రూ.2వేల వరకు లభిస్తోంది. హిందూపురం ప్రాంతంలో 5వేల టన్నుల వరకు నిల్వ ఉంది.
సంతలోనే కూరలు కుతకుత!