Hyderabad Old Man Bike Yatra : ఈయన పేరు రమేశ్‌చంద్రబాబు. వయసు 72 ఏళ్లు. హైదరాబాద్ కూకట్‌పల్లి పరిధిలోని మాధవీనగర్ వాసి. గుత్తేదారుగా పనిచేశారు. గిన్నిస్‌బుక్‌లో చోటు సాధించడమే లక్ష్యంగా 1.70 లక్షల కి.మీ. బైక్ యాత్రను ఈ నెల 10న హైదరాబాద్‌లో ప్రారంభించారు. సోమవారం కామారెడ్డికి చేరుకున్నారు. ‘సీనియర్ సిటిజన్లు అద్భుతాలు చేయగలరు’ అంటూ ద్విచక్ర వాహనంపై రాయించుకొని దేశవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టారు.
Hyderabad Old Man Bike riding: ఈ పెద్దాయనంతే.. 72 ఏళ్ల వయసులో బైక్ యాత్ర - హైదరాబాద్‌లో 72 ఏళ్ల వయసులో బైక్ యాత్ర
Hyderabad Old Man Bike Yatra : ఏడు పదుల వయసు దాటినా కృష్ణారామ అంటూ ఆయన ఓ మూలన కూర్చోలేదు. నడవడానికే ఆయాసపడే ఆ వయస్సులో.. స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుతూ టైంపాస్ చేయలేదు. సాధించాలనే పట్టుదల ఉంటే వయసు అడ్డురాదంటున్నాడు..హైదరబాద్ కు చెందిన వాసి రమేశ్ చంద్రబాబు. గిన్నిస్ బుక్కే లక్ష్యంగా భారత దేశ బైక్ యాత్రకు బయలు దేరాడు..ఈ ఔత్సాహిక పెద్ద మనిషి.
Hyderabad Old Man Bike Yatra news : ‘బెంగళూరుకు చెందిన ఓ కన్సెల్టెన్సీ రూట్‌మ్యాప్ తయారుచేసి ఇచ్చిందని.. రోజుకు సుమారు 250 కి.మీ. చొప్పున 700 రోజులపాటు యాత్ర సాగుతుందని.. ఆదివారాలు, పండగ రోజుల్లో విశ్రాంతి తీసుకుంటానని రమేశ్‌చంద్ర పేర్కొన్నారు. రెండేళ్ల కిందట ఈ ఆలోచన రావడంతో విశ్రాంత సైనిక అధికారి భీమయ్య వద్ద ఆర్నెల్లపాటు తగిన శిక్షణ పొందానన్నారు.
హైదరాబాద్ నుంచి తిరుపతి, విజయవాడ, అరుణాచలం క్షేత్రాలకు ద్విచక్ర వాహనంపై విజయవంతంగా వెళ్లి వచ్చాక, లభించిన ఆత్మవిశ్వాసంతో ఈ యాత్రకు సిద్ధమైనట్లు వెల్లడించారు. స్పోర్ట్స్ డాక్టర్ వద్ద వైద్య పరీక్షలన్నీ చేయించుకొని.. ఆయన సూచనల మేరకు ప్రయాణం సాగిస్తున్నట్లు వివరించారు. గతంలో ఉత్తర్‌ప్రదేశ్ వాసి ఇలా 1.16 లక్షల కి.మీ.లు ఇలా బైకుపై ప్రయాణించారని, ఆ రికార్డును అధిగమిస్తానని రమేశ్‌చంద్రబాబు ధీమా ప్రకటించారు.