మండలానికో తెలుగు మాధ్యమ పాఠశాల - latest news on english medium ap
అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దడానికే... ఆంగ్లమాధ్యమం ప్రవేశ పెట్టామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తెలుగు మాధ్యమం కావాలని కోరితే మండలానికి ఒక పాఠశాలను ఏర్పాటు చేస్తామని న్యాయస్థానానికి నివేదించింది.

తెలుగు మాధ్యమం కావాలని కోరితే మండలానికి ఒక పాఠశాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. విద్యా హక్కు చట్ట నిబంధనల మేరకు ఆ పాఠశాల దూరంగా ఉంటే.. విద్యార్థులకు ఉచిత రవాణా కల్పిస్తామని తెలిపింది. ఉర్దూ, కన్నడ, తమిళం, ఒడియా భాషా పాఠశాలలను కొనసాగిస్తామని పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకే... ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టామని కోర్టుకు తెలిపింది. ఆంగ్లమాధ్యమం జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు. ఒకటి నుంచి 10వరకు తెలుగును ఓ సబ్జెక్ట్‌గా తప్పనిసరి చేసినట్లు ఆయన వెల్లడించారు. పదో తరగతి ఫలితాలు.. ఆంగ్లమీడియంలోనే బాగున్నాయన్నారు. వివిధ వర్గాల నుంచి వినతులు అందాకే... ఆంగ్లమాధ్యమం నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బలహీన వర్గాల పిల్లలకు ఆంగ్లమాధ్యమం నిరాకరించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ అంశాలను....పరిగణనలోకి తీసుకొని ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణను మూసివేయాలని... పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోర్టును కోరారు.