నవరత్నాల్లో భాగంగా 'పేదలందరికీ ఇళ్లు' పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. డిసెంబర్ 25న ప్రారంభమయ్యే ఇళ్ల పట్టాల పంపిణీకి మూడు ప్రాంతాల్లో వేర్వేరు తేదీలను ప్రభుత్వం ఎంపిక చేసింది. డిసెంబర్ 25న కోస్తాంధ్రలో, రాయలసీమలో 28న... ఉత్తరాంధ్రలో 30న పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. ఈ మూడు తేదీల్లోనూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగానే పంపిణీ జరగనుంది. 30లక్షల 75 వేల మంది లబ్ధిదారులకు ఉచిత ఇళ్లపట్టాలతో పాటు.... టిడ్కో ఇళ్లు, క్రమబద్ధీకరించిన ఆక్రమిత స్థలాల పట్టాలను అందించనున్నారు.
ఇళ్ల పట్టాల పంపిణీకి రాష్ట్రవ్యాప్తంగా 68వేల 361 ఎకరాలను సేకరించారు. ఇందులో 25వేల 359 ఎకరాల ప్రైవేట్ భూమి ఉండగా.... దాని సేకరణకు 10వేల 150 కోట్లు ఖర్చయ్యాయి. మిగతా భూమి ప్రభుత్వ అధీనంలోనే ఉండటంతో మొత్తంగా 17వేల పైచిలుకు లే-అవుట్లను వేశారు. 23వేల 535 కోట్ల రూపాయల విలువైన భూమిని ఇళ్లపట్టాల ద్వారా పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన 9వేల 676 ఎకరాలకు సంబంధించి కోర్టు వివాదాలు నడుస్తుండటంతో 3లక్షల 65వేల ఇళ్లపట్టాలను మరో విడతలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.