అమెజాన్ కాల్ సెంటర్ పేరుతో సైబర్ నేరగాళ్ళు ఓ మహిళను మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడలో జరిగింది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలని చెప్పిన కేటుగాళ్లు ఆమె ఖాతా నుంచి రూ.3 లక్షలు కాజేశారు. నగరంలోని ఎల్లారెడ్డిగూడకు చెందిన ఓ మహిళ అమెజాన్‌లో ఒక వస్తువును బుక్ చేసింది. సదరు వస్తువు డెలివరీ కాకపోవడం వల్ల కస్టమర్ కేర్ సెంటర్ నెంబర్ కోసం గూగుల్‌లో వెతికింది.
అందులో కనిపించిన నంబర్‌కు కాల్ చేయడంతో ఆ వస్తువు స్టాక్ లేదని.. డబ్బులు రిటర్న్ చేస్తామని సైబర్ కేటుగాళ్ళు నమ్మబలికారు. తాము పంపించే క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలని చెప్పి ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.3 లక్షలు కాజేశారు. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.