మధుర స్మృతులను నిత్యం కళ్లముందు ఉండేలా చేసే కళ ఫోటోగ్రఫీ. శుభకార్యాలు, చిన్ననాటి తీపి జ్ఞాపకాలు, స్నేహితులతో ఆహ్లాదంగా గడిపిన క్షణాలు...ఇలా సందర్భం ఏదైనా ఫోటోలు, వీడియోలు గుర్తుండిపోయేలా చేస్తాయి. వాటిని బంధించి భద్రంగా అందించే ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు లాక్‌డౌన్‌లో పూర్తిగా ఉపాధి కోల్పోయారు. అందరూ నవ్వుతూ హాయిగా ఉండాలని కోరుకునే ఫోటోగ్రాఫర్లు... రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు చవిచూస్తున్నారు. ఇళ్లు గడవక.. దుకాణాల అద్దెలు సైతం చెల్లించలేకపోతున్నారు. వివాహాలు, పుట్టిన రోజులు.. ఇలా శుభకార్యాలు చాలా వరకు తగ్గిపోయాయి. అరకొరగా పెళ్లిళ్లు జరుగుతున్నా కార్యక్రమాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఫోటోగ్రాఫర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తగ్గిన బేరాలు..
గ్రేటర్ పరిధిలో సుమారు 25వరకు ఫోటో, వీడియో గ్రాఫర్ల అసోసియేషన్లు ఉన్నాయి. ప్రధానంగా వేసవి కాలమే వీళ్లకు సీజన్. ప్రస్తుత పరిస్థితుల్లో వధూవరుల ఫోటో షూట్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. పెళ్లికి 40 మందికి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇవ్వగా... సందడి లేకుండా పోయింది. అంగరంగ వైభవంగా వేడుక నిర్వహించుకునే వాళ్లూ... కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిరాడంబరంగా వివాహాలు చేసుకుంటున్నారు. ఫోటోగ్రాఫర్లకు బేరాలు తగ్గిపోగా.. ఒప్పుకున్న కార్యక్రమాలకూ వెళ్లలేక పోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఈ-పాస్‌లు ఇవ్వడం లేదని ఐడీ కార్డులు చూపినా... అడ్డుకుంటున్నారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. లక్షలు పెట్టి కెమెరాలు కొనుగోలు చేశామని.. నెలవారీ చెల్లింపులు చేయడం ఇబ్బందిగా మారిపోయిందని వాపోతున్నారు.