ప్రభుత్వాసుపత్రుల్లో ప్రస్తుతానికి ఆక్సిజన్, ఔషధాల కొరత లేదని ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య) ఆళ్ల నాని వెల్లడించారు. మలిదశలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను స£మర్థంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఏపీని కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా మార్చాలన్న కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. వైరస్ నిర్ధారణ పరీక్షలు పెంచి, త్వరితగతిన ఫలితాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో మలిదశ కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలపై సమీక్షించేందుకు ఏర్పడిన మంత్రుల కమిటీ తొలి సమావేశం మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం జరిగింది. అనంతరం మంత్రులు సుచరిత, కన్నబాబు, ఆదిమూలపు సురేష్‌లతో కలిసి ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని విలేకర్లతో మాట్లాడారు.
‘ఔషధాలు, ఆక్సిజన్ కొరత దేశవ్యాప్తంగా ఉంది. 360 టన్నుల ఆక్సిజన్ ప్రభుత్వాసుపత్రులకు అందుతోంది. అక్కడ చికిత్స పొందే రోగులకు ప్రస్తుతానికి ఇబ్బందుల్లేవు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 10% అటూఇటూగా ఆక్సిజన్ కొరత ఉంది. ఒడిశా నుంచీ ఆక్సిజన్ తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్రానికి ఆక్సిజన్ వచ్చేలా చర్యలు మొదలుపెట్టాం. కేంద్రం నుంచి కూడా ఆక్సిజన్ విషయంలో తగిన సహకారం లభిస్తోంది. సీఎం జగన్ ఆదేశాలను అనుసరించి సొంతంగా ప్లాంటు నిర్మాణానికి వీలుగా అధికారులు ప్రతిపాదనలు తయారుచేస్తున్నారు’ అని చెప్పారు.
పరీక్షల నిర్వహణపై ఆందోళన: కరోనా పరీక్షల నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని, ఫలితాలు సకాలంలో ఇవ్వాలన్న విషయంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పది, ఇôటర్ పరీక్షల పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తే తలెత్తే పరిణామాలపైనా పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.