ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రీఎంబర్స్‌మెంట్‌ చెల్లింపులపై రివ్యూ పిటిషన్ వేయనున్న ప్రభుత్వం

ap highcourt school reimbursement
ap highcourt school reimbursement

By

Published : Sep 7, 2021, 1:09 PM IST

Updated : Sep 7, 2021, 3:02 PM IST

13:06 September 07

కళాశాలలకు ప్రభుత్వం నేరుగా చెల్లించాలన్న హైకోర్టు తీర్పుపై నిర్ణయం

 రీఎంబర్స్‌మెంట్‌ చెల్లింపులపై హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు తీర్పుపై నాడు-నేడు సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేశ్‌, అధికారులతో చర్చించారు. హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం మంత్రి సురేశ్‌ మీడియాతో మాట్లాడారు.. ఎన్నికల హామీల్లో భాగంగానే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పారు. రెగ్యులేటరీ కమిషన్‌తో ఫీజులు నిర్ణయించాక నాలుగు విడతల్లో ఫీజులను చెల్లిస్తున్నామని తెలిపారు. పారదర్శకత కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయాలని సీఎం జగన్‌ నిర్ణయించారని.. దీని ద్వారా కళాశాలలో నాణ్యమైన విద్య అందడంతో పాటు తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. విద్యాదీవెనపై పూర్తి సమాచారంతో హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని సీఎం నిర్ణయించారని.. పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని కోరతామని తెలిపారు.

 ఇంటర్‌ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో చేపట్టవద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆదేశాలు ఇంకా తమకు అందలేదని మంత్రి చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇంటర్‌లో ఆన్‌లైన్‌ అడ్మిషన్ల విధానం చేపట్టిందన్నారు. ఆన్‌లైన్‌ అడ్మిషన్లతో నాణ్యమైన విద్య, ఫీజు, రిజర్వేషన్లు తదితర సదుపాయాలను విద్యార్థులు పొందుతారన్నారు. ఇంటర్‌, డిగ్రీ తరగతులకు ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ద్వారా రిజర్వేషన్ల అమలు పరిపూర్ణంగా జరుగుతోందని చెప్పారు. విద్యార్థులు కోరుకున్న కళాశాలలో అడ్మిషన్లు పొందే సదుపాయం ఉంటుందన్నారు. గతేడాది కూడా ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టామని గుర్తు చేశారు. న్యాయస్థానానికి పూర్తి సమాచారం ఇచ్చి ఆన్‌లైన్‌ అడ్మిషన్ విధానాన్ని పునరుద్దరించాలని ప్రభుత్వం తరఫున కోరతామని సురేశ్‌ తెలిపారు.

జీవోలు 28, 64 సవాలు చేస్తూ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలోని ‘ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సంఘం’ అధ్యక్షుడు ఎస్‌హెచ్‌ఆర్‌ ప్రసాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు..  కళాశాలల్లో చదివే అర్హులైన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద చెల్లించే బోధన రుసుములను (ఫీజు రీయింబర్స్‌మెంట్‌) తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడాన్ని  తప్పుబట్టింది. ఇకనుంచి విద్యార్థుల తరఫున సొమ్మును కళాశాలల ఖాతాల్లోనే జమ చేయాలని అధికారులను ఆదేశించింది. తల్లుల ఖాతాలో జమ చేసేందుకు వీలు కల్పించే జీవో 28ని రద్దు చేసింది. మరో జీవో 64లోని నిబంధనలను కొట్టేసింది. ఇప్పటికే తల్లుల ఖాతాల్లో జమ చేసిన నగదును కళాశాలలకు చెల్లించేలా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉండదని పేర్కొంది. ఆయా కళాశాలలు విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చని తెలిపింది.

 త్రైమాసికానికి ప్రభుత్వం తల్లుల ఖాతాలో జమ చేసిన సొమ్మును 40% మంది కళాశాలలకు చెల్లించలేదని హైకోర్టు గుర్తు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును తల్లులు చెల్లించకపోతే కళాశాలలు చదువు చెప్పలేవని తెలిపింది. తల్లులు రుసుము చెల్లించకపోతే ఆ విద్యార్థి కళాశాలలో కొనసాగే అంశంపై జీవో పేర్కొనలేదని ఆక్షేపించింది. కళాశాలల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తే విద్యార్థులు మధ్యలో చదువుకు దూరమయ్యే అవకాశం చాలా తక్కువని పేర్కొంది. తద్వారా పథకం ఉద్దేశం నెరవేరదని తెలిపింది. అందువల్ల తల్లుల ఖాతాలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము జమ చేసేందుకు వీలు కల్పిస్తున్న జీవోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 

ఇదీ చదవండి: 

HIGH COURT: తల్లుల ఖాతాల్లో బోధన రుసుములా!

Last Updated : Sep 7, 2021, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details