రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ముందస్తుగా పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్రం నియమించిన కమిటీ తేల్చిచెప్పింది. మున్ముందు రాష్ట్రానికి కేటాయించిన వాటా నీటినే తీసుకునేలా పరిమితం చేయడంతో పాటు, రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలాగే పంపుల సామర్థ్యం ఉండేలా చూడాలని పేర్కొంది. రక్షణ చర్యల విషయంలో మాత్రం పంపుల సామర్థ్యం పరిమితి అంశానికి మినహాయింపు ఇచ్చింది.
కేంద్ర కమిటీ అధ్యయనం
కేంద్ర అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పుల శాఖ నియమించిన నిపుణుల కమిటీ రాయలసీమ ఎత్తిపోతల అంశాన్ని అధ్యయనం చేసింది. జులై 29న ఈ కమిటీ సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కర్నూలు చీఫ్ ఇంజినీర్ మురళీనాథ్‌రెడ్డి, కన్సల్టెంటు తదితరులతో సమావేశమైంది. రాయలసీమ ఎత్తిపోతల వల్ల పర్యావరణపరంగా ఇబ్బందులు ఎదురవుతాయంటూ తెలంగాణకు చెందిన జి.శ్రీనివాసరావు చెన్నైలోని గ్రీన్ ట్రైబ్యునల్‌లో కేసు దాఖలు చేశారు. ఈ విషయంలో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ట్రైబ్యునల్ ఆదేశించింది. దీనిపై కేంద్రం ఓ కమిటీని నియమించి... వారికి అధ్యయన బాధ్యతలు అప్పగించింది. కేంద్ర పర్యావరణశాఖ ఆధ్వర్యంలోని రివర్ వ్యాలీ ప్రాజెక్టుల ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ సూచించిన సభ్యులు, హైదరాబాద్ ఐఐటీలోని సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ శశిధర్, కృష్ణా బోర్డు సభ్యుడు హరికేష్ మీనా, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి శాస్త్రవేత్త టి.మమతలతో ఈ కమిటీ ఏర్పాటైంది. వీరు అధ్యయనం చేసి... రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ముందస్తుగా పర్యావరణ అనుమతులు అవసరం లేదని తేల్చారు.
- తెలుగుగంగ, శ్రీశైలం కుడిగట్టు కాలువ, గాలేరు-నగరి సుజల స్రవంతి పథకాలు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకుంటాయని కేంద్ర కమిటీ పేర్కొంది. శ్రీశైలం జలాశయం 854 మీటర్ల వద్ద గ్రావిటీ ద్వారా ఈ పథకాలకు నీరు అందిస్తారని వివరించింది. ప్రస్తుతం ఈ పథకం ఆ మూడింటికీ నీరందించేందుకు ఉద్దేశించినదేనని స్పష్టం చేసింది. శ్రీశైలం కుడి కాలువకు నీటిని అదనంగా ఇస్తూ, ఆ నీటిని పై పథకాలకు రాయలసీమ ఎత్తిపోతల ద్వారా వినియోగించుకుంటారని తెలిపింది. ఈ మూడు పథకాలు వేర్వేరు సమయాల్లో నిర్మించారని.. వాటికి పర్యావరణ అనుమతులు ఉన్నాయని కమిటీ స్పష్టం చేసింది.
- గడిచిన 20 ఏళ్లలో శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ, ఏపీలలోని ఇతర ప్రాజెక్టులు ప్రతిపాదించిన నీటిమట్టం స్థాయి కన్నా దిగువ నుంచే నీటిని తీసుకున్నాయని కమిటీ తెలిపింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్ ఆధారంగా మిగిలిన ప్రాజెక్టులపై, సామాజికంగా ఎలా ప్రభావం చూపుతుందన్నది కృష్ణా బోర్డు మదింపు చేయాలని సూచించింది.
- ప్రాజెక్టు నిర్మాణంలో తలెత్తే కాలుష్య సమస్యలు, ఇబ్బందులకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. వ్యర్థాల నిర్వహణపై పకడ్బందీ చర్యలుండాలని స్పష్టం చేసింది. కృష్ణా బోర్డు నుంచి... అలాగే అటవీ భూమి అవసరమైతే అందుకు తగిన అనుమతులు పొందాలని కమిటీ సూచనలు చేసింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూములు తీసుకోవాలని స్పషంచేసింది. ప్రాజెక్టులో ఏ భాగమైనా.. వన్యప్రాణి సంరక్షణ ప్రాంత పరిధిలోకి వస్తే వారి అనుమతులు పొందాలని చెప్పింది.