కొవిడ్ నియంత్రణ చర్యల (covid control measures )పై హైకోర్టు (ap high court) లో విచారణ జరిగింది. కొవిడ్ వైద్య చికిత్సలు సక్రమంగా అందడం లేదంటూ దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై జస్టిస్ విజయలక్ష్మి, జస్టిస్ రమేష్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రధానంగా బ్లాక్ ఫంగస్(black fungus cases) ఇంజెక్షన్ల కొరత, చిన్నారులపై కొవిడ్ ప్రభావం, తీసుకుంటున్న చర్యలపై విచారించింది. చిన్నారులపై కొవిడ్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు సీఎం అధ్యక్షతన టాస్క్ ఫోర్సు కమిటీ పని చేయనుందని ప్రభుత్వ తరపు న్యాయవాది వివరించారు. మూడో విడత కొవిడ్ వ్యాప్తి పై ఐసీఎంఆర్, ఇతర సంస్థల నుంచి ఎలాంటి అధికార నిర్ధరణ జరగలేదని.. అయినప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని వివరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1,777 బ్లాక్ ఫంగస్ కేసులు(black fungus cases) ఉన్నాయని చెప్పారు. మరో వైపు బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరతపై కేంద్ర ప్రభుత్వం తరపున సమర్పించిన అఫిడవిట్ సమగ్రంగా లేదని.. పూర్తి వివరాలను మళ్లీ కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్(covid-19) తో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని.. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద పరిహారం ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు కోర్టును అభ్యర్ధించారు. ఇరువైపు వాదనలు న్యాయస్థానం.. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.