AP Govt targets diversion of university funds: విశ్వవిద్యాలయాల నిధులను ఇతర కార్యకలాపాలకు మళ్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఒకసారి వర్సిటీల నుంచి 150 కోట్ల రూపాయలను.. రాష్ట్ర ఫైనాన్సియల్ సర్వీసెస్ కార్పొరేషన్‌లో డిపాజిట్ చేయించుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు మరోమారు నిధులపై దృష్టి పెట్టింది. అన్ని విశ్వ విద్యాలయాల నుంచి 2వేల కోట్ల రూపాయలు మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విశ్వవిద్యాలయాల ప్రొఫైల్ పేరుతో ఉన్నత విద్యా మండలి ద్వారా ఆర్థిక వివరాలు సేకరిస్తోంది.
వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం:మీ వర్సిటీలో ఎంత మంది పని చేస్తున్నారు? ఎంతమంది పింఛనర్లు ఉన్నారు? ఏడాదికి జీతాలు, పింఛన్లకు ఎంత చెల్లిస్తున్నారు? మీ ఆదాయ వనరులేంటి? ఇప్పటివరకు ఎంత నిల్వ ఉంది? ఏయే బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేశారు? కాలపరిమితి ఎప్పటికి పూర్తవుతుంది? అంతర్గత ఆదాయవనరులతో చేస్తున్న అభివృద్ధి కార్యకలాపాలేంటి? అనే వివరాలు అందించాలని ఉన్నత విద్యామండలి ఆదేశించింది.
ఇప్పటికే జీతభత్యాలకు ప్రభుత్వం ఇస్తున్న బడ్జెట్ సరిపోకపోవడం లేదు:విశ్వవిద్యాలయాలు, బోర్డులలోని నిధులను కార్పొరేషన్‌లో డిపాజిట్ చేయాలని గతంలో ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో కొంత మొత్తం డిపాజిట్ చేశారు. అంతా డిపాజిట్ చేస్తే వెనక్కి రావని కొన్నింటిని అట్టిపెట్టుకున్నారు. ఇప్పుడు వాటినీ లాగేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో పింఛన్లు, జీతభత్యాలకు ప్రభుత్వం ఇస్తున్న బడ్జెట్ సరిపోకపోవడంతో సొంత నిధులు ఖర్చుచేస్తున్నారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పదవీ విరమణ ఉద్యోగులకు మూడేళ్లుగా ప్రయోజనాలను అందడంలేదు. ఇప్పుడున్న నిధులనూ తీసేసుకుంటే భవిష్యత్తులో వర్సిటీ పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది.