ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అనాథలకు.. ఆ ఆశ్రమమే 'అమ్మానాన్న'! - Amman nanna foundation

తామెవరో వారికే తెలియదు. ఎక్కుడున్నారో గుర్తించలేరు. ఒంటిమీద దుస్తులున్నాయా? లేవా ? అన్న స్పృహ ఉండదు. ఆకలేస్తే చెత్తకుండీల వద్ద వ్యర్థాలతోనే కడుపు నింపుకుంటారు. నీడ కోసం బస్ స్డాండ్‌లు, రైల్వే స్టేషన్లును ఆశ్రయిస్తారు. ఇలాంటి అనాథలు, అభాగ్యులను అక్కున చేర్చుకుంటుంది తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని 'అమ్మా నాన్న అనాథ ఆశ్రమం'!

amma nanna foundation providing shelter to more than 500 people
అనాథలకు 'అమ్మానాన్న' ఆ ఆశ్రమం.. అభాగ్యులకు శ్రీనిలయం..

By

Published : Oct 24, 2021, 1:55 PM IST

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురానికి చెందిన గట్టు శంకర్‌.. చౌటుప్పల్‌లో ఎలక్ట్రానిక్స్‌ దుకాణం నిర్వహించేవారు. అతడి పెదనాన్న కొడుకు మానసిక పరిస్థితి బాగాలేక చిన్నప్పుడే ఇంటికి దూరమయ్యారు. మూణ్నెళ్ల తర్వాత హైదరాబాద్‌లో కనిపించనప్పటికీ అతడి ఆరోగ్యం క్షీణించి మరణించారు. మానసిక వికలాంగులెవరూ దిక్కులేకుండా చావకూడదనే సదుద్దేశంతో 2010లో చౌటుప్పల్‌లో ఇద్దరు మానసిక వికలాంగులతో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. తొలుత శంకర్‌ ఆశయానికి స్నేహితులు, స్థానికుల అండగా నిలిచారు. అప్పటి నల్గొండ జిల్లా కలెక్టర్‌ ముక్తేశ్వరరావు.. శంకర్‌కు చౌటుప్పల్‌ పరిసరాల్లో 10 గుంటల భూమిని కేటాయించారు. ఎన్నారైలు, దాతలు, అప్పటి జిల్లా ఎస్పీ దుగ్గల్, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులిచ్చిన విరాళాలతో షెడ్లు, ఇతర వసతులు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడది దాదాపు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు పూర్తిచేసుకుని 534 అనాథలకు నీడనిస్తోంది.

అనాథలకు 'అమ్మానాన్న' ఆ ఆశ్రమం.. అభాగ్యులకు శ్రీనిలయం..

సేవలు చేసేందుకు 20 మంది..
16 నుంచి 60 ఏళ్ల వయసున్న మానసిక వికలాంగులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. వీరికి సపర్యలు చేయడానికి 20 మంది సిబ్బంది నిరంతరం సేవలందిస్తుంటారు. వారికి జీతాలను శంకర్‌ సొంతంగా ఇస్తున్నారు. ప్రస్తుతం ఆశ్రమంలోని 130 మందికి ఆసరా పింఛన్లను ప్రభుత్వం అందజేస్తోంది. వీరికి తలా ఆరు కేజీల చొప్పున బియ్యం సైతం ఇస్తున్నారు. మరింత మందికి పింఛన్, రేషన్‌ బియ్యం అందితే అనాథలకు తిండికి ఎలాంటి లోటులేకుండా చూస్తామంటున్నారు శంకర్‌. వారంలో ఒకరోజు హైదరాబాద్‌ నుంచి మానసికవైద్య నిపుణులు వచ్చి చికిత్స అందిస్తారు. కొన్నిసార్లు సమస్య తీవ్రంగా ఉంటే వారిని హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని మానసిక దవాఖానాలో చికిత్స ఇప్పిస్తారు.

నెలకు 18 లక్షల ఖర్చు..
పునర్జన్మ కార్యక్రమం కింద రోడ్లపై తిరిగేవారిని తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేయించి, కొత్తబట్టలు ఇచ్చి, భోజనం పెడతారు. ఇలా రోజువారీగా చేయడం వల్ల మానసిక జ్ఞప్తిని కోల్పోయిన వారు తిరిగి మాములు మనుషులవుతున్నారు. గతం గుర్తొచ్చిన మరికొందరు సొంతిళ్లకు చేరుకుంటున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా ఆశ్రమంలోని వంద మందికి సోకింది. బాధితులందరికీ షెడ్డులో ప్రత్యేక ఏర్పాట్లు చేసి రోజూ వారీగా వైద్యుల సలహా మేరకు చికిత్స అందించడంతో అందరూ కోలుకున్నారు. ప్రస్తుతం ఆశ్రమ నిర్వహణ కోసం నెలకు 15 నుంచి 18 లక్షల రూపాయలు ఖర్చవుతుండగా, విరాళాలు మాత్రం ఆ మేర రాక కొంత ఇబ్బందులు పడుతున్నామని శంకర్‌ తెలిపారు.

ఆదర్శంగా నిలుస్తోన్న ఆశ్రమం..
చౌటుప్పల్‌ సమీపంలోని ఆరేగూడెంనకు చెందిన బాలమ్మను ఆశ్రమం చేరదీసింది. ఆ కృతజ్ఞతతో ఆమె తనకున్న 13 ఎకరాల విలువైన భూమిని ఆశ్రమానికే రాసిచ్చారు. సొంత మనుషులే పరాయివారిగా మారి దూరమవుతున్న ఈ రోజుల్లో ఏ బంధమూ లేకపోయినా అమ్మానాన్నలాగా అక్కున చేర్చుకుంటున్న ఆశ్రమ నిర్వాహకులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇదీ చూడండి:

సంస్కృతీ సంప్రదాయాల్లో విలువైన ఆరోగ్య సూత్రాలు!

ABOUT THE AUTHOR

...view details