గుంటూరు జిల్లా మందడంలో అమరావతి రైతులు వినూత్న నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్లే సమయంలో పోలీసులు తమను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ... మాక్ మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలకపూడి శ్రీనివాస్ ముఖ్యమంత్రిగా.. ఇతర రైతులు మంత్రులుగా నటించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు చేయడం తప్ప మంత్రులుగా తాము సొంత నిర్ణయాలు తీసుకోలేమని చెప్పినట్టుగా ప్రదర్శన నిర్వహించారు.
ముఖ్యమంత్రి జగన్ సచివాలయం నుంచి తాడేపల్లి వెళ్లే సమయంలోనూ పోలీసులు దీక్షా శిబిరం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దించారు. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.