విధిరాతను సంకల్ప బలంతో జయించి ఆదర్శంగా నిలుస్తున్నాడో యువకుడు. తెలంగాణ కుమురం భీం జిల్లా కౌటాల మండలం గురుడుపేటకు చెందిన నికాడె విష్ణుమూర్తి డిగ్రీ వరకు చదివారు. నాలుగేళ్ల కిందట వరిధాన్యం కుప్పలను క్రషర్‌లో వేసే క్రమంలో ప్రమాదవశాత్తు రెండు కాళ్లు క్రషర్ చక్రాల్లో పడ్డాయి. మోకాళ్ల వరకు ఛిద్రమైపోయాయి.
ఆదుకున్న ఎమ్మెల్యే కోనప్ప
ఆయన పరిస్థితిని తెలుసుకున్న సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రత్యేక చొరవ తీసుకుని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించారు. జర్మన్ సాంకేతికతతో తయారైన రెండు కృత్రిమ కాళ్లను అమర్చేలా కృషి చేశారు. తనవంతు సాయం చేయడంతో పాటు ప్రభుత్వం నుంచీ సాయం అందేలా చర్యలు తీసుకున్నారు.