నోట్లో ఎముకలు, బిర్యానీ కుక్కి కరెంట్ షాక్- పవిత్ర కళ్లముందే దర్శన్ చిత్రహింసలు
Published : Jun 22, 2024, 9:31 AM IST
Renukaswamy Death Case Pavithra Gowda : రేణుకా స్వామి హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హత్యకు ముందు అతడికి కరెంటు షాక్ ఇచ్చి చిత్ర హింసలు పెడుతున్న సమయంలో పవిత్రా గౌడ ఘటనా స్థలంలోనే ఉన్నట్లు పోలీసులు విచారణలో తేలింది. జూన్ 8న రేణుకాస్వామిని చిత్రదుర్గలో కొందరు దుండగులు అపహరించి, బెంగళూరులోని పట్టణగెరెకు తీసుకెళ్లారు. అక్కడ ఓ షెడ్డులో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. తాను శాకాహారినని చెప్పినా, బలవంతంగా బిర్యానీ, ఎముకను నోట్లో పెట్టి తినిపించి వేధించారు. అంతటితో ఆగకుండా అతడిపై కర్రలతో దాడి చేసి, పలుమార్లు కరెంటు షాక్ ఇచ్చి చిత్రహింసలు పెట్టారు. ఆ సమయంలో పవిత్రా గౌడ కొద్దిసేపు అక్కడే ఉన్నారని, దర్శన్ అతడిని కొట్టడాన్ని కళ్లారా చూశారని తెలిసింది.