జగన్ నెరవేర్చని హామీలపై టీడీఎల్పీ భేటీలో ఛార్జ్‌షీట్' విడుదల చేసిన చంద్రబాబు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 4, 2024, 10:36 PM IST
Charge sheet on YSRCP failures: తెలుగుదేశం శాసనసభాపక్ష భేటీలో చంద్రబాబు వైఎస్సార్సీపీ వైఫల్యాలపై ఛార్జిషీట్ విడుదల చేశారు. ‘ప్రజాకోర్టు – జగన్ నెరవేర్చని హామీలు పేరిట ఛార్జ్ షీట్’ను ఆవిష్కరించారు. ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. జగన్ చెబుతున్న 99 శాతం హామీల అమలు అనేది అతి పెద్ద బూటకమన్నారు. అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తున్న జగన్ కు ప్రజాకోర్టులో శిక్ష పడడం ఖాయం అన్నారు. ఎన్నికల ముందు ఊరూరా తిరిగి అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ నేడు ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారంటూ చంద్రబాబు మండిపడ్డారు.
సీఎం జగన్ మేనిఫెస్టో, పాదయాత్రలో మొత్తం 730 హామీల్లో 21 శాతం కూడా అమలు చేయకుండా 99 శాతం అమలు చేశానంటూ ప్రజల్ని వంచిస్తున్నారన్నారని విమర్శించారు. మోస పూరిత మాటలతో ప్రజలను మోసం చేస్తున్న జగన్ కు మరో రెండు నెలల్లో ప్రజాకోర్టులో శిక్ష తప్పదన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పి 64 వేల కోట్ల భారం మోపారన్నారు. మద్య నిషేధం హామీని..అటకెక్కించి మద్యం అమ్మకాలపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25 వేల కోట్లు అప్పులు తెచ్చారంటూ తప్పుబట్టారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ గాలికొదిలేశారన్నారు.