టీడీపీ ప్రభుత్వంలో కడప స్టీల్ ప్లాంట్‌ను సాధించుకుంటాం : భూపేశ్ రెడ్డి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 10, 2024, 2:15 PM IST
Bhupesh Reddy Padayatra for Kadapa Steel in YSR District : కడప స్టీల్ ప్లాంట్ సాధన కోసం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. కడప ఉక్కు కర్మాగారానికి రెండుసార్లు శంకుస్థాపన చేసి పనులు చేపట్టకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డి యువతను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపేశ్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర జమ్మలమడుగు నుంచి పెద్ద దండ్లూరు వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఆరు మండలాల టీడీపీ శ్రేణులు, జనసేన నేతలు హాజరయ్యారు.
సీఎం జగన్ అధికార పగ్గాలు చేపట్టి ఐదేళ్ల అవుతున్న కడప స్టీల్ ప్లాంట్‌కు రెండు సార్లు శంకుస్థాపన చేశారు, కానీ నిర్మాణ పనులు మాత్రం చేపట్టాలేదని భూపేశ్ రెడ్డి ధ్వజమెత్తారు. జమ్మలమడుగు ప్రాంతంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే ఒక్క కడప జిల్లాకే కాకుండా రాయలసీమ ప్రాంతవాసులందరికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే కడప ఉక్కును సాధించుకుందామని పిలుపునిచ్చారు.