Planet Parade 2025:ఆకాశంలో ఓ మహాద్భుతం సాక్షాత్కారం కానుంది. సౌరవ్యవస్థలోని ఏడు గ్రహాలు సూర్యుడికి ఒకవైపునకు వచ్చి చేరి ఒకే సరళరేఖపై దర్శనం ఇవ్వనున్నాయి. ఖగోళ శాస్త్రంలో దీన్ని 'ప్లానెట్ పరేడ్'గా పిలుస్తారు. మహాశివరాత్రి అనంతరం అంతరిక్షంలో కనువిందు చేయనుండటంతో ఈ దృశ్యానికి మరింత విశిష్టత సంతరించుకుంది.
ప్లానెట్ పరేడ్:రిపబ్లిక్ డే సందర్భంగా పాత్ ఆఫ్ డ్యూటీలో నిర్వహించే కవాతును మీరు చూసే ఉంటారుగా? అయితే ఇప్పుడు అలాంటి దృశ్యమే ఆకాశంలో ప్రత్యక్షం కానుంది. అంటే మన సౌర వ్యవస్థలో గ్రహాల అమరిక సూర్యుడికి ఒకవైపున ఒకే వరుసలోకి వచ్చి చేరడం వల్ల అది అందమైన ప్లానెట్ పరేడ్గా కన్పించనుంది.
ఆ సమయంలో శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు వంటి గ్రహాలను ఎలాంటి ప్రత్యేక పరికరాలను ఉపయోగించకుండానే మన కళ్లతో స్పష్టంగా చూడొచ్చు. అయితే వీటిలో నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలను చూడటం మాత్రం టెలిస్కోప్ ద్వారానే సాధ్యమవుతుంది.
ఇటీవలే జనవరి 21వ తేదీన అంతరిక్షంలో 6 గ్రహాల పరేడ్ దర్శనమిచ్చింది. అయితే ఈసారి ఏకంగా ఏడు గ్రహాలు ఒకే లైన్లోకి వచ్చి కనువిందు చేయనున్నాయి. అంటే ఇప్పటికే సూర్య కుటుంబంలోని ఆరు గ్రహాలు శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, నెప్ట్యూన్, యూరేనస్ ఒకే వరుసలోకి వచ్చి చేరగా.. ఇప్పుడు ఈ లైన్లోకి కొత్తగా బుధుడు వచ్చి చేరాడు.
దీంతో ఈసారి ఆకాశంలో ఏడు గ్రహాల పరేడ్ కన్పించనుంది. ఈ ఖగోళ అద్భుతం ఫిబ్రవరి 28న మనకు దర్శనం ఇవ్వనుంది. దీన్ని జీవితంలో ఒక్కసారి మాత్రమే చూడగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈసారి మిస్ అయితే మాత్రం మళ్లీ 2040 వరకు ఇలాంటి అరుదైన దృశ్యాన్ని చూడలేమని అంటున్నారు.